పుప్పాలగూడ, నార్సింగిలో శివబాలకృష్ణ భూమాయ..ఎన్నికలకు ముందు 100 ఫైళ్లకు గ్రీన్​ సిగ్నల్​‌‌‌‌‌‌‌‌

పుప్పాలగూడ, నార్సింగిలో శివబాలకృష్ణ భూమాయ..ఎన్నికలకు ముందు 100 ఫైళ్లకు గ్రీన్​ సిగ్నల్​‌‌‌‌‌‌‌‌
  • వందల కోట్లు విలువ చేసే రియల్​ ఎస్టేట్​ ప్రాజెక్టులకు అనుమతులు
  •  నిషేధం ఉన్నా రెండు సంస్థల​వెంచర్ల ఫైల్స్ క్లియర్
  • హెచ్‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌డీఏ సిబ్బంది, అధికారులను ప్రశ్నించిన ఏసీబీ

హైదరాబాద్, వెలుగు:హెచ్‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌డీఏ టౌన్‌‌‌‌‌‌‌‌ప్లానింగ్‌‌‌‌‌‌‌‌ మాజీ  డైరెక్టర్, రెరా సెక్రటరీ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో తవ్వినా కొద్దీ అక్రమాల గుట్టురట్టవుతున్నది. రెండు ప్రముఖ రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ కంపెనీలకు పుప్పాలగూడ, నార్సింగిలోని రూ.వందల కోట్లు విలువ చేసే ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లకు అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీ విచారణలో వెలుగు చూసింది. ఆ సంస్థలకు చెందిన ప్రతినిధులను కూడా ఏసీబీ విచారించింది. రెండు బడా రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌సంస్థలకు లబ్ధి చేకూరేలా బాలకృష్ణ అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బాలకృష్ణను ఏసీబీ అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు.7వ రోజు కస్టడీలో భాగంగా మంగళవారం విచారించారు. చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలు నుంచి అమీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌ మైత్రీవనంలోని హెచ్‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌డీఏ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కు తీసుకువెళ్లి ప్రశ్నించారు. సిబ్బంది, అధికారుల స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేశారు. నేటితో కస్టడీ ముగియనుండగా, కోర్టును మరో ఐదు రోజుల గడువు కోరే అవకాశం ఉంది.

ఫైల్స్ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌పై విచారణ

ఈ కేసులో ఇప్పటికే సేకరించిన డాక్యుమెంట్లు, బినామీ ఆస్తుల వివరాల ఆధారంగా బాలకృష్ణను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లోని బాలకృష్ణ ఛాంబర్‌‌‌‌‌‌‌‌లో సోమ, మంగళవారం కూడా సోదాలు చేశారు. నిషేధం ఉన్నప్పటికీ దాదాపు 100కు పైగా ఫైల్స్‌‌‌‌‌‌‌‌ను ఎన్నికలకు ముందు ఆయన క్లియర్ చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా మంది అధికారులతో కలిసి అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ అనుమానిస్తున్నది. ఈ క్రమంలోనే హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ ప్రధాన కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్నది. డాక్యుమెంట్ల ప్రకారం సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుంటున్నది. రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌సంస్థలు అనుమతులు పొందిన తేదీలు, కండీషన్స్‌‌‌‌‌‌‌‌ గురించి బాలకృష్ణ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న సూపరింటెండెంట్, ఇతర సిబ్బంది స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ను రికార్డ్ చేసింది.

ఛేంజ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌ యూస్‌‌‌‌‌‌‌‌తో భూ మాయ

 ‘ఛేంజ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ల్యాండ్‌‌‌‌‌‌‌‌ యూస్‌‌‌‌‌‌‌‌’ ప్రక్రియలో పెండింగ్‌‌‌‌‌‌‌‌ ఫైల్స్‌‌‌‌‌‌‌‌ను శివబాలకృష్ణ అక్రమంగా క్లియర్ చేసినట్లు తెలిసింది. ఇందులో భారీగా డబ్బు చేతులు మారినట్లు సమాచారం. హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలోని విలువైన భూములను రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌సంస్థల ద్వారా తన బినామీల పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడనే దానిపై ఏసీబీ ఆధారాలు సేకరిస్తున్నది. రెరా సెక్రటరీగా కూడా అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీకి సమాచారం అందినట్లు తెలిసింది.హెచ్‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌డీఏ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇప్పించడంలో బాలకృష్ణ కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది.

శివబాలకృష్ణ ఇచ్చిన.. అనుమతులపై ఏసీబీ ఆరా

హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ శివబాలకృష్ణ ఇచ్చిన అనుమతులకు సంబంధించిన ఫైళ్లను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఆయన చాంబర్​లో ఉన్న అన్ని డాక్యుమెంట్లలోని వివరాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా భారీ భవన నిర్మాణాలు, లే అవుట్ల అనుమతులు, ల్యాండ్ కన్వర్షన్ పర్మిషన్ల ఫైళ్లు పరిశీలించారు. హెచ్​ఎండీఏలో శివబాలకృష్ణ పని చేసినన్ని రోజులకు సంబంధించిన వివరాలన్నీ ఏసీబీ అధికారులు తెలుసుకుంటున్నారు. ఆయనతో కలిసి పని చేసిన వాళ్లను కూడా ప్రశ్నించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్స్ నుంచి శివబాల కృష్ణ పెద్ద మొత్తంలో లంచంగా తీసుకున్నట్టు చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు ముందే దాదాపు వంద ఫైళ్లను క్లియర్ చేశాడు. వాటి గురించి కూడా ఆరా తీస్తున్నారు. వట్టి నాగులపల్లి ప్రాంతంలోని వివిధ నిర్మాణాలు, లే అవుట్లకు పర్మిషన్లు, చేంజ్ ఆఫ్ ల్యాండ్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు భారీగా ముడుపులు తీసుకున్నాడన్న ప్రచారం జరుగుతున్నది. పర్మిషన్ల కోసం వచ్చే వారి నుంచి రేటు డిసైడ్ చేసి మరీ వసూళ్లకు పాల్పడ్డాడన్న ఆరోపణలూ వస్తున్నాయి. కొందరు బినామీలను ఏర్పాటు చేసుకుని వారి ద్వారానే పనులు చక్కపెట్టుకునేవాడని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అపార్ట్​మెంట్ల నిర్మాణానికి ఒక్కో ఫ్లోర్​కు లక్ష నుంచి రెండు లక్షలు, లే అవుట్​లకు రూ.25 లక్షల నుంచి 50లక్షల దాకా వసూలు చేశాడన్న ఆరోపణలున్నాయి. ఆయన చాంబర్​లో కంప్యూటర్ ఆపరేటర్​గా పని చేసి ఇటీవలే ఆకస్మికంగా చనిపోయిన శేఖర్ అనే ఉద్యోగి శివ బాలకృష్ణకు బినామీగా ఉన్నాడని కొందరు అధికారులు చెప్తున్నారు.

బాలకృష్ణ సోదరుడు అరెస్ట్​

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్​చేశారు. గత మూడు రోజులపాటు అతడిని విచారించిన అధికారులు శివబాలకృష్ణ అక్రమాస్తులకు నవీన్​కుమార్​ బినామీగా ఉన్నట్లు తేల్చారు. ఈ మేరకు నవీన్​కుమార్​పేరిట బాలకృష్ణ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయనను మంగళవారం అరెస్ట్​చేశారు.

Also Read:నాలుగు నెలలుగా జీతాల్లేవ్.. ఇబ్బంది పడుతున్న 104  సిబ్బంది