
కొచ్చి: కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడింగా (80) కేరళలో మృతిచెందారు. ఆయుర్వేద చికిత్స కోసం ఇక్కడకు వచ్చిన రైలా ఒడింగా.. కూతట్టుకులంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా బుధవారం ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. ఆయన పార్థివదేహాన్ని దేవమాత ఆసుపత్రికి తరలించారు. 6 రోజుల క్రితం తన కుమార్తె, కుటుంబ సభ్యులతో కలిసి ఒడింగా కూతట్టుకులం చేరుకున్నారు.
కేరళ ఆయుర్వేదంపై ఒడింగాకు విశ్వాసం ఎక్కువ. గతంలోనూ తన కుమార్తెకు దృష్టి సమస్య ఉండగా.. ఆయుర్వేద చికిత్సతో నయమైంది. దీంతో మరోసారి వైద్యం కోసం ఇక్కడికి రాగా, ఈ విషాదం చోటుచేసుకుంది. ఇక ఆయన మరణానికి సంబంధించిన లాంఛనాలను పూర్తి చేయడానికి అధికారులు ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు సమాచారం అందించారు.
కెన్యా రాజకీయాల్లో పవర్‌ఫుల్ లీడర్..
రైలా ఒడింగా 1945 జనవరి 7వ తేదీన పుట్టారు. కెన్యా రాజకీయాల్లో పవర్ఫుల్లీడర్గా గుర్తింపు పొందారు. ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమకారుడిగా8 ఏండ్లపాటు జైలుశిక్ష అనుభవించారు. 1992లో కెన్యా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. 2008–2013 వరకు కెన్యా ప్రధానిగా సేవలందించారు. కాగా, ఒడింగా మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. తన ప్రియ మిత్రుడు, కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా మరణవార్త విని తాను చాలా బాధపడినట్లు ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.