
హన్మకొండ: సీఎం కేసీఆర్ ఖేల్ ఖతం అని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు గుండె విజయ రామారావు మండిపడ్డారు. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బండి సంజయ్ ను అరెస్ట్ చేసే సమయంలో టీఆర్ఎస్ నాయకులు గూండాల్లా వ్యవహరించారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందునే బండి సంజయ్ ను అరెస్ట్ చేశారన్న ఆయన... ప్రజాస్వామ్య బద్ధంగా పాదయాత్ర చేస్తుంటే అధికార పార్టీ నేతలకు ఏం ఇబ్బంది కలిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం ద్వారా కేసీఆర్ పెద్ద తప్పు చేశారని, దానికి మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ దీక్షను అడ్డుకుంటే... ఆనాడు ఉన్న అన్ని పార్టీలు ఆయనకు మద్దతుగా నిలిచాయని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు పట్టిన గతే టీఆర్ఎస్ కు పడుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా బండి సంజయ్ పాదయాత్రను కొనసాగేలా చూడాలని, లేకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారన్నారు.