ఎవర్రా మీరు?.. మీ కథేంది?

ఎవర్రా మీరు?.. మీ కథేంది?

వరంగల్ అర్బన్: ఎన్నికల ప్రచారం విషయంలో స్వేచ్ఛగా క్యాంపెయినింగ్‌ చేసుకోనివ్వాలని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు.  పాదయాత్ర కోసం తాను ముందు దరఖాస్తు చేసుకుంటేనే పర్మిషన్లు ఇచ్చారని ఈటల చెప్పారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత పోలీసులు సహకరించాలని.. కానీ బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలను పీకేస్తున్నారని ఆరోపించారు. మైకులు పెట్టనీయడం లేదని మండిపడ్డారు.  తాము తలచుకుంటే మాడి మసై పోతారని.. ఎవడ్రా మీరు.. మీ కథేందని వార్నింగ్ ఇచ్చారు. 

పది లక్షలిస్తామంటే ప్రజలు నమ్ముతారా?
‘పోలీసులు మమ్మల్ని ఫొటోలు తీస్తున్నారు. మేం నక్సలైట్లామా? కావాలంటే గులాబీ డ్రెస్ వేసుకుని రండి. మేం కేసీఆర్‌‌కు బానిసలమని చెప్పండి. పోలీసు అధికారులకు చెబుతున్నా.. మీ డ్యూటీ మీరు చేయండి. దళిత బంధు పేరుతో దళిత కుటుంబాలకు పది లక్షలిస్తే సంతోషమే. కానీ ఇది మోసపు ప్రకటన అని గుర్తించాలి. దళిత ముఖ్యమంత్రి అన్నారు.. ఇచ్చారా మరి? రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినట్లే ఇచ్చి పీకేశారు. మూడెకరాల భూమి ఇచ్చారా ? మంత్రిగా ఉండి కూడా కొత్త పింఛన్లు ఇచ్చే అధికారం లేకుండా పోయింది. ఎర్రబెల్లికి కూడా ఇప్పుడు కొత్త పింఛన్లు ఇచ్చే అధికారం లేదు. ఒకనాడు పింఛన్లు కావాలని సర్పంచ్ రాస్తే వచ్చేది. కానీ మూడేళ్లుగా కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. పెళ్లిళ్లు చేసుకుని వేరుపడిన వారికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే అధికారం కూడా మాకు లేకుండే. ఇవన్నీ చేయలేని మీరు దళిత బంధు పేరుతో పది లక్షలు ఇస్తామంటే ప్రజలు నమ్ముతారా?’ అని ఈటల ప్రశ్నించారు.  

సీఎం కుర్చీ గుంజుకోవాలనుకోలేదు
‘ఓట్ల కోసం హుజూరాబాద్‌‌లో దళిత బంధును ఇస్తారు కావొచ్చు. కానీ పది కోట్లు ఇచ్చినా మా నియోజకవర్గ ప్రజలు అమ్ముడుపోరు. ఈ సొమ్మంతా జనాలు పన్నులు కడితే వచ్చింది. అది కేసీఆర్ సొమ్ము కాదు. పశువులను అంగట్ల కొన్నట్లు హుజురాబాద్‌‌లో నేతలను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రోజు సిద్ధిపేటకు బస్సుల్లో తీసుకెళ్లి బువ్వపెట్టి నా గురించే చెబుతున్నారు. నేను సీఎం కావాలని ఆశపడ్డానని ఆరోపణలు చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రి కావాలని అనుకోలేదు. ఆయన కుర్చీ గుంజుకోవాలనుకోలేదు. కానీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరాను. నాలాగా పద్ధతి తప్పని కొందరు మంత్రులు ఇంకా అక్కడే ఉన్నారు.  సిద్ధిపేట మంత్రి ఎగిరెగిరి పడుతున్నడు. ఇవ్వాళ నాకు జరిగిందే.. రేపు ఆయనకూ జరుగుతుంది’ అని ఈటల పేర్కొన్నారు.