
సిద్దిపేట, వెలుగు : ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మంది కార్మికులను స్వదేశానికి రప్పించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఓ ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట జిల్లాలకు చెందిన కార్మికులు గల్ఫ్ వెళ్లి అక్కడ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని, చేతిలో డబ్బులు లేక, స్వదేశానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడిచినా గల్ఫ్, ఎన్‌ఆర్‌ఐ పాలసీకి అతీగతి లేదని, కనీసం టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ఏర్పాటు చేయకపోవడం సరికాదన్నారు. వలస కార్మికుల కుటుంబాలను సైతం కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించి జోర్డాన్‌లో చిక్కుకున్న 12 మందిని వెనక్కి రప్పించాలని డిమాండ్ చేశారు.