
- మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సీబీఐకి అప్పగిస్తామని చెప్పడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమనీ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక వైపు రాహుల్ గాంధీ సీబీఐ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందని విమర్శిస్తే, తెలంగాణ కాంగ్రెస్ మాత్రం సీబీఐకి కేసు అప్పగిస్తామని ప్రకటించిందన్నారు. మీకు చేతకాకుంటే ఎఫ్‌బీఐకి, మోసాద్‌కు గానీ అప్పగించండని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతాంగం కష్టాలు పడుతోందని ఆయన విమర్శించారు.
సూర్యాపేట, నల్లగొండ ఎస్పీలు జాగ్రత్తగా పని చేయాలని సూచించారు. ఎస్సై, సీఐలను మీరు కంట్రోల్ చేయాలి తప్ప కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు కాదన్నారు. వందల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంటే, నల్లగొండ రైతులకు మాత్రం నీళ్లు రావడం లేదని, ఎస్ఎల్బీసీ పూర్తి చేయలేకపోతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంకా వాగ్దానాలు చేయడం సిగ్గుచేటన్నారు.