- మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాల, వెలుగు: జగిత్యాల పట్టణ నడిబొడ్డున ఉన్న రూ.100 కోట్ల విలువైన మున్సిపల్ భూమిని కబ్జా చేశారని, దానిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వే నంబర్ 138లోని 20 గుంటల మున్సిపల్ భూమిని ఎటువంటి యాజమాన్య హక్కులు లేకుండా కొందరు పెట్రోల్ పంపు పేరుతో కబ్జా చేశారని తీవ్రంగా విమర్శించారు.
1952లో ఆ భూమిని ప్రజా అవసరాలు తీర్చేందుకు పెట్రోల్, డీజిల్, కిరోసిన్ అవుట్ లెట్ కోసం దారం వీరమల్లయ్యకు అప్పగించినట్లు చెప్పారు. కానీ ఆయన కేవలం 4 గుంటల్లో అవుట్ లెట్ చేసి, మిగిలిన 16 గుంటల్లో వాణిజ్య దుకాణాలు నిర్మించారని చెప్పారు. వీరమల్లయ్య బతికినంతకాలం అగ్రిమెంట్ (కిబాలా)ను ఎప్పుడూ బయటపెట్టలేదని, ఆయన మరణానంతరం వారసులమని చెప్పుకుంటూ కొందరు కొత్త కిబాలాతో రంగంలోకి దిగారని ఆరోపించారు. కలెక్టర్ చొరవతీసుకొని ఆక్రమిత భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరారు.
జీవన్‌రెడ్డి ఆరోపణలు అవాస్తవం
జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల పట్టణంలోని సర్వే నం.138లోని పెట్రోల్ పంప్ స్థలంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తమని బంక్ నిర్వాహకుడు మంచాల కృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తాత దారం వీరమల్లయ్య 1952లో మున్సిపాలిటీ నుంచి 20 గుంటల స్థలాన్ని రూ.2,000కు కిబాలా ద్వారా కొనుగోలు చేసి, రికార్డులో నమోదు చేయించారన్నారు. మున్సిపల్ తీర్మానంపై వచ్చిన వివాదాల నేపథ్యంలో హైకోర్టులో కేసు వేయగా 2008 డిసెంబర్ 16న విచారణ జరిపి, మున్సిపల్ కౌన్సిల్ తీర్మానాన్ని రద్దు చేసినట్లు చెప్పారు.
