కేసీఆర్పై కక్షతోనే కాళేశ్వరంపై కుట్ర : మాజీ మంత్రి జోగు రామన్న

 కేసీఆర్పై కక్షతోనే కాళేశ్వరంపై  కుట్ర : మాజీ మంత్రి జోగు రామన్న
  •  బీఆర్ఎస్​ ఆధ్వర్యంలో పలు చోట్ల ఆందోళనలు

ఆదిలాబాద్​టౌన్/నేరడిగొండ/జన్నారం, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్​పై రాజకీయ కక్షతోనే కాంగ్రెస్​ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ఆదిలాబాద్​జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశించడాన్ని నిరసిస్తూ మంగళవారం బీఆర్ఎస్​ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పట్టణంలోని కుమ్రం భీమ్ చౌరస్తాలో ధర్నా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

 దీంతో నాయకులు, పోలీసుల తోపులాట జరిగింది. జోగు రామన్న మాట్లాడుతూ.. గోదావరి జలాలను ఎత్తిపోసి తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే గొప్ప సంకల్పంతో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, అయితే మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగిపోవడాన్ని సాకుగా తీసుకుని లక్షలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే ప్రాజెక్టును అభాసుపాలు చేస్తున్నారని మండిపడ్డారు. జస్టిస్ ఘోష్ నివేదిక అవాస్తవాలతో కూడిందని ఆరోపించారు. పలువురు నేతలు పాల్గొన్నారు.

 కాంగ్రెస్ విష ప్రచారం మానుకోవాలి

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న విష ప్రచారాన్ని మానుకోవాలని నేరడిగొండ మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి అన్నారు. మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికే కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రదాయని అని, దానిపై ఇచ్చిన జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్ట్ తప్పులతడక అని అన్నారు. కేసీఆర్​పై కావాలనే బురద చల్లుతున్నారని, సీబీఐ విచారణ అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. 

మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ డాక్టర్ జహీర్, మాజీ వైస్ ఎంపీపీ మహేందర్ రెడ్డి, వీడీసీ చైర్మన్ రవీందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ అధ్వర్యంలో జన్నారం మండల కేంద్రంలో బీఆర్​ఎస్ నేతలు రాస్తారోకో నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశించడాన్ని వ్యతిరేకించారు. బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి భరత్ కుమార్, మండల జనరల్ సెక్ర టరీ జనార్దన్, మాజీ వైస్ ఎంపీపీ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.