దోచుకోవడానికే కొనుగోలు కేంద్రాలు పెట్టిన్రా? : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

దోచుకోవడానికే కొనుగోలు కేంద్రాలు పెట్టిన్రా? : మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్​(నాగర్​ కర్నూల్​), వెలుగు: రైతులు పండించిన ప్రతి వడ్ల గింజా కొంటామని మంత్రులు రోజూ ఊదరగొడుతుంటే, పండించిన ధాన్యం  కొనకుండా ఆఫీసర్లు, మిల్లర్లు కుమ్మకై  రైతులను అరిగోస పెడ్తున్నారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. రైతులను దోచుకోవడానికే ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచినట్లుందని మండిపడ్డారు. మంగళవారం కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆయన  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వడ్లు కొన్న తర్వాత  రశీదు ఇవ్వడం లేదని, 4 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు వాపోయారు.

ఇంత తరుగు ఎందుకని అడిగితే వడ్లు దింపుకోకుండా వేధిస్తున్నారని రైతులు ఆరోపించారు. వెంటనే  అడిషనల్​ కలెక్టర్ మోతీలాల్​కు ఫోన్​ చేసిన జూపల్లి  రైతులు ఇబ్బందులు పడుతుంటే మిల్లర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కల్లాలు,రోడ్లు వడ్ల కుప్పలతో కనిపిస్తుంటే కొనుగోలు కేంద్రాలు తెరిచే దిక్కులేదని మండిపడ్డారు.  బీఆర్​ఎస్​ మంత్రులు, ఎమ్మెల్యేలు  రాష్ట్రాన్ని, రైతులను గాలికొదిలి దేశాన్ని ఉద్ధరిస్తామని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.  రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని వారి కడుపు మంట నుంచే మరో ఉద్యమం మొదలవుతుందని హెచ్చరించారు.