నాగం దారెటు?... ఠాక్రే, జానారెడ్డి మాట్లాడినా మెత్తబడని మాజీ మంత్రి

నాగం దారెటు?...  ఠాక్రే, జానారెడ్డి మాట్లాడినా మెత్తబడని మాజీ మంత్రి
  •     ఫార్వర్డ్​ బ్లాక్​లో చేరిన మరో సీనియర్​ సీఆర్ జగదీశ్వర్​ రావు
  •     పార్టీలు మారినవారికి టికెట్  ఇచ్చి తమను గడ్డిపోచల కిందజమకట్టారని సీఆర్  ఫైర్
  •     నాగర్​కర్నూల్​, కొల్లాపూర్​లో నిలువునా చీలుతున్న కాంగ్రెస్  క్యాడర్

నాగర్​ కర్నూల్, వెలుగు: నాగర్​కర్నూల్​​ నుంచి కాంగ్రెస్​ టికెట్​ ఆశించి రాకపోవడంతో పార్టీపై తిరుగుబావుటా ఎగరేసిన ఆ పార్టీ సీనియర్​ లీడర్, మాజీ మంత్రి​ నాగం జనార్దన్​ రెడ్డి దారి ఎటు అనే చర్చ జరుగుతోంది. కొల్లాపూర్​ టికెట్ దక్కని మరో  సీనియర్​ నేత సీఆర్  జగదీశ్వర్​రావు శుక్రవారం ఫార్వర్డ్​ బ్లాక్​ పార్టీలో చేరగా, పార్టీ మార్పుపై నాగం ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి  మాణిక్​ రావు​ఠాక్రే, కాంగ్రెస్​ చేరికల కమిటీ కన్వీనర్​ జానా రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి తదితరులు ఇప్పటికే నాగంతో మాట్లాడారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే కీలక బాధ్యతలు అప్పగిస్తామని ఆఫర్​ చేసినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా నాగర్​ కర్నూల్​ నుంచి బరిలో దిగి కాంగ్రెస్  హైకమాండ్​కు బుద్ధి చెప్పాలని నాగం అనుచరులు కోరుతుండడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఇటు నాగర్​కర్నూల్, అటు కొల్లాపూర్  నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ క్యాడర్​ రెండుగా చీలిపోయింది.   

షాకిచ్చిన కాంగ్రెస్ హైకమాండ్

నాగర్​కర్నూల్​లో నాగం జనార్దన్​ రెడ్డి, కొల్లాపూర్​ నియోజకవర్గం నుంచి సీఆర్​ జగదీశ్వర్​ రావు ఇద్దరూ టికెట్లు ఆశించారు. పార్టీ హైకమాండ్​ మాత్రం బీఆర్ఎస్​ నుంచి కాంగ్రెస్​లో చేరిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు కొల్లాపూర్​ టికెట్, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​ రెడ్డి కొడుకు రాజేశ్​ రెడ్డికి నాగర్​కర్నూల్​  టికెట్​ ఇచ్చింది. టికెట్లు ప్రకటించగానే రెండు చోట్లా అసమ్మతి భగ్గుమంది. నాగం, జగదీశ్వర్​రావు తమ అనుచరులతో మీటింగ్​ పెట్టి తమ తడాఖా ఏంటో హైకమాండ్​కు చూపిస్తామని సవాల్​ విసిరారు.

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు పార్టీ టికెట్​ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కొల్లాపూర్​ కాంగ్రెస్​ ఇన్ చార్జి సీఆర్​ జగదీశ్వర్​ రావు శుక్రవారం ఆల్​ ఇండియా ఫార్వర్డ్​ బ్లాక్​ పార్టీలో చేరారు. సింహం గుర్తుపై పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. తాను గెలిచి తీరుతానంటూ ప్రకటించిన సీఆర్..​ పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారిన వారికి పిలిచి టికెట్ ఇచ్చి తమను గడ్డిపోచల కింద జమకట్టారని మండిపడ్డారు. కొల్లాపూర్​లో తన తడాఖా ఏంటో చూపుతానని సవాలు​ చేశారు. అలాగే కల్వకుర్తి నుంచి కాంగ్రెస్​ టికెట్​ ఆశించిన సుంకిరెడ్డి రాఘవేందర్​ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్​ రెడ్డి మధ్య విభేదాలతో చివరి నిమిషంలో కాంగ్రెస్  పార్టీలో చేరిన బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డికి టికెట్​ఇచ్చారు.

కల్వకుర్తి నుంచి తాను పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే వంశీచంద్​ రెడ్డి ముందుగానే ప్రకటించారు. తనను సంప్రదించకుండా పార్టీలో చేరిన రాఘవేందర్​ రెడ్డికి.. బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కసిరెడ్డిని పార్టీలోకి తీసుకురావడం ద్వారా వంశీచంద్  రెడ్డి చెక్  పెట్టారు. అలాగే మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రెడ్డి తెరవెనక మంత్రాంగం నడిపించి కసిరెడ్డికి టికెట్​ దక్కడంలో తన వంతు పాత్ర పోషించారు. ​

నాగం, సుంకిరెడ్డికి బీఆర్ఎస్​ వల?

మాజీ మంత్రి డాక్టర్  నాగం జనార్దన్​ రెడ్డిని తమ పార్టీలోకి చేర్చుకోవడానికి బీఆర్ఎస్​ టాప్​ లీడర్లు సంప్రదింపులు ప్రారంభించారని సమాచారం. కాంగ్రెస్​ పార్టీ నుంచి అత్యంత అవమానకరంగా నాగంను వెళ్లగొట్టేందుకు కొందరు కుట్ర చేశారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. పాపులారిటీ, సర్వేల పేరుతో టికెట్లను డైరెక్ట్​గా బేరంపెట్టి నాగంను బయటకు పంపించే ప్రయత్నం చేశారని కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు.

నాగంను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​ రెండు మూడు రోజుల్లో ఆయన ఇంటికి వెళ్తారని సమాచారం. అయితే, ఏం జరుగుతుందో తెలియకుండా దీనిపై తానేం మాట్లాడనని నాగం చెప్పారు. మరోవైపు ఐక్యతా ఫౌండేషన్​ చైర్మన్​ సుంకిరెడ్డి రాఘవేందర్​ రెడ్డిని బీఆర్ఎస్​లోకి చేర్చుకునేందుకు మంత్రులు హరీశ్ ​రావు, కేటీఆర్​ టీంలు ఆయనకు పలు ఆఫర్లు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. నాగర్​ కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పరిస్థితిని చక్కదిద్దకపోతే ఈ రెండు నియోజకవర్గాల ప్రభావం పక్కనున్న జడ్చర్ల, అచ్చంపేట, వనపర్తిపై పడుతుందని కాంగ్రెస్​ నేతలు టెన్షన్​ పడుతున్నారు.