
- జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ విజయం ఖాయం
- మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య
జనగామ, వెలుగు : బీసీ లీడర్‌గా 45 ఏండ్లు పడిన అవమానాలు భరించలేకే కాంగ్రెస్ పార్టీని వీడానని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. జనగామలోని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంప్ ఆఫీస్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘పొన్నాల లక్ష్మయ్య ఎప్పుడూ పులిలాంటి వాడే, అవసరం వచ్చినప్పుడు గర్జిస్తాడు, బీసీల జపం చేసినంత మాత్రాన బయటకు వెళ్లిపోయిన వారు తిరిగి పార్టీలోకి వస్తారని అనుకోవడం కాంగ్రెస్ నాయకుల భ్రమ’ అని అన్నారు.
తాను ఎలాంటి కండీషన్లు పెట్టకుండానే బీఆర్‌ఎస్‌లో జాయిన్ అయినట్లు చెప్పారు. తాను తిరిగి కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్లు దుష్ర్పచారం జరుగుతోందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్ క్యాండిడేట్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో సానుభూతితో పాటు సెటిలర్ల ఓట్లు ప్రభావం చూపుతాయని, ఈ రెండింటి మద్దతు బీఆర్ఎస్‌కే ఉందన్నారు.
50 శాతం ఓట్లతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర ఇప్పటివరకు లేదని, 35 శాతానికి అటుఇటుగా వచ్చిన ఓట్లతో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వారు జనాల మద్దతు మొత్తం తమకే ఉన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు. సమావేశంలో లీడర్లు గాడిపల్లి ప్రేమలతారెడ్డి, పసుల ఏబేలు, బండ యాదగిరిరెడ్డి, బాల్దె సిద్దిలింగం, శారద, తాళ్ల సురేశ్‌రెడ్డి, ఎండీ మాజిద్,ధర్మపురి శ్రీనివాస్ పాల్గొన్నారు.