ఎంపీ అభ్యర్థులెవరో.. కేసీఆర్ నిర్ణయిస్తరు

ఎంపీ అభ్యర్థులెవరో.. కేసీఆర్ నిర్ణయిస్తరు
  •     దానికి అందరూ కట్టుబడి ఉండాలి: శ్రీనివాస్ గౌడ్
  •     కలిసికట్టుగా పని చేయాలని కామెంట్

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులెవరో పార్టీ చీఫ్ కేసీఆర్ నిర్ణయిస్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు. లోక్​సభ సన్నాహక సమావేశాలు ముగిసిన తర్వాత పార్టీ కార్యాచరణను కేసీఆర్ నిర్ణయిస్తారని తెలిపారు. గురువారం తెలంగాణ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. 2009 నుంచి వరుసగా మూడు లోక్​సభ ఎన్నికల్లో మహబూబ్​నగర్​ లోక్​సభ సీటు బీఆర్ఎస్ గెలుచుకుందన్నారు. 2009లో కేసీఆర్ మహబూబ్​నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ ఏర్పడిందన్నారు.

పార్లమెంట్​లో తెలంగాణ గొంతు బలంగా వినిపించాలంటే ఎంపీలుగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లోక్​సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పుడు హామీలు నమ్మి ప్రజలు మోసపోయారన్నారు. తమ కండ్లను తామే పొడుచుకున్నామని బాధపడుతున్నట్టు చెప్పారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో చెప్పని హామీలు కూడా నెరవేర్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు, మహిళలు సహా అన్నివర్గాల వారు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు.