బీఆర్ఎస్​కు ఆరేపల్లి మోహన్ రిజైన్...త్వరలో కాంగ్రెస్ గూటికి..!

బీఆర్ఎస్​కు ఆరేపల్లి మోహన్  రిజైన్...త్వరలో కాంగ్రెస్ గూటికి..!
  • పార్టీ చీఫ్ కేసీఆర్​కు రాజీనామా లేఖ
  •     అమరుల ఆశయాలు ఏవీ నెరవేరలేదు
  •     బీఆర్ఎస్​లో పనిచేసే పరిస్థితులు లేవు
  •     త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న మాజీ ఎమ్మెల్యే

కరీంనగర్, వెలుగు : మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని, అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని అందుకే పార్టీని వీడుతున్నట్లు స్పష్టం చేశారు. 2019లో కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరి పార్టీకి శక్తివంచన లేకుండా పనిచేశానని, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లోనూ తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చానని గుర్తు చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి తీరుపై ఎన్నిసార్లు హైకమాండ్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా మానకొండూరు అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, ఇకపై కూడా ప్రశ్నించే గొంతుకగా ఉంటానని చెప్పారు. తాను ఎమ్మెల్యే టికెట్ కోసం రాజీనామా చేయడం లేదని, కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ లో పనిచేసే పరిస్థితులు లేనందున తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ తోపాటు, పార్టీలోని ఇతర పెద్దలకు పంపిస్తున్నట్లు తెలిపారు. రెండు, మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ప్రజాస్వామ్యం కాపాడే దిశలో దళితుల అభ్యున్నతికి అండగా ఉంటానని తెలిపారు. 

త్వరలో కాంగ్రెస్ గూటికి..!

బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన తర్వాత తనకు టికెట్ రాకపోవడంతో ఆరేపల్లి మోహన్ షాక్ కు గురయ్యారు. తన అనుచురులతో సుదీర్ఘంగా చర్చించి బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆరేపల్లి మోహన్ ను పిలిపించి మాట్లాడి బుజ్జగించారు. ఓ దశలో ఆయనకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి ఇస్తామనే హామీ దక్కినట్లు ప్రచారం జరిగింది. కానీ రోజులు గడిచినా ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో ఆయన తిరిగి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. టికెట్ విషయంలో హామీ లభించకపోయినా అధికారంలోకి వస్తే సముచిత స్థానం ఉంటుందని చెప్పడంతో ఆ పార్టీలో చేరేందుకు ఆరేపల్లి మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.