పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డి 

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డి 

తాను బీజేపీని వీడి టీఆర్ఎస్ లోకి వెళ్తున్నానని వస్తున్న వార్తలు అవాస్తవమని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కొట్టిపారేశారు. తాను బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక దగ్గర పడుతున్న సమయంలో ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్, కేటీఆర్.. ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ లో ఉద్యమ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను ఒక్కొక్కరిని పార్టీ నుంచి వెళ్లగొట్టారని చెప్పారు. టీఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారులను కావాలనే బొంద పెట్టారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీకి నైతిక విలువలు లేవని తాము గ్రహించే పార్టీని వీడి బీజేపీలో చేరామన్నారు. తిరిగి టీఆర్ఎస్ లోకి వెళ్తామనుకోవడం అవివేకం అన్నారు. 

ఓటమిని అంచున ఉండడం వల్లే టీఆర్ఎస్ నాయకులు ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారంటూ  ఏనుగు రవీందర్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీఆర్ఎస్ ను ఓడిస్తామన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలానికి బీజేపీ ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నానని, ఇక్కడ బీజేపీకి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.