30 రోజుల్లో రూ.14 వేల కోట్ల అప్పు : గొంగిడి సునీత

30 రోజుల్లో రూ.14 వేల కోట్ల అప్పు :  గొంగిడి సునీత
  • మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత 

యాదగిరిగుట్ట, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఆడిపోసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే  రూ.14 వేల కోట్ల అప్పు ఎందుకు చేశారో చెప్పాలని  మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేస్తామని హామీలు ఇచ్చి కాంగ్రెస్‌‌ .. తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.  మంగళవారం యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్‌‌లో నిర్వహించిన ఆలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్

డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుభరోసా కింద డిసెంబర్ 9న  ఎకరానికి రూ.15 వేలు రైతుల అకౌంట్లలో వేస్తామన్న రేవంత్ రెడ్డి  రూ.5 వేలు కూడా వేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ కంటే ఎక్కువ మంచి పనులు చేస్తుందని కాంగ్రెస్‌‌కు అవకాశం ఇచ్చిన ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారన్నారు.   కేసీఆర్‌‌ సీఎంగా లేని తెలంగాణను  ఊహించుకోలేకపోతున్నారని చెప్పారు.   తాను ఎమ్మెల్యేగా ఓడినా  ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తానని  స్పష్టం చేశారు.  ఆలేరు ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుంటానని చెప్పారు.

 గులాబీ క్యాడర్ అధైర్య పడొద్దని, అన్నిరకాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సుదగానిహరిశంకర్ గౌడ్, జడ్పీటీసీ తోటకూరి అనురాధ బీరయ్య, ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ మోత్కుపల్లి జ్యోతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్లు ఇమ్మడి రాంరెడ్డి, గూదె బాలనర్సయ్య, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య పాల్గొన్నారు.