
- ఈ నెల 27న చేరిక
చేవెళ్ల, వెలుగు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఈ నెల 27వ ఉదయం 11 గంటలకు బీజేపీలో చేరనున్నారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్, నవాబ్‌పేట్ తదితర మండలాల్లో మాజీ ఎమ్మెల్యే అభిమానులు, బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు ఆయనతో పాటు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన వెంట నియోజకవర్గంలోని మంచి పేరు ఉన్నా నేతలు రత్నం వెంట నడిచేందుకు అడుగులు వేస్తున్నారు. రత్నం బీజేపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు చెబుతున్నారు.
మారుతున్న సమీకరణాలు
చేవెళ్ల రాజకీయ సమీకరణాలు వేగం పుంజుకున్నాయి. బీఆర్ఎస్లో ఉన్న చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆయన టీడీపీ హాయాంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ర్టం సిద్ధించి 2014 ఎన్నికల బరిలో నిలిచారు. అదే ఏడాది కాంగ్రెస్ నుంచి కాలే యాదయ్య గెలుపొందారు. ఆయన గెలిచిన తర్వాత బీఆర్ఎస్‌లో చేరిపోయారు. బీఆర్ఎస్ 2018 లో యాదయ్యకు అధిష్టానం అవకాశం ఇవ్వడంతో రత్నం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చకున్నారు. 2019 చేవెళ్ల లోక్‌సభ ఎన్నికల ముందు మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం మరోసారి ఎమ్మెల్యే యాదయ్యకు రత్నంకు మధ్య బీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ నెలకొంది. బీఆర్‌ఎస్ అధిష్టానం మరోసారి ఎమ్మెల్యే యాదయ్య వైపే మొగ్గు చూపడం.. ఆయనకే టికెట్ ఇవ్వడంతో రత్నం పార్టీ మారడం తప్పని పరిస్థితి ఏర్పడింది. టీడీపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి పిలుపు రాకపోవడంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమైపోయింది. బీజేపీ నుంచి ఎమ్మెల్యే టికెట్కన్ఫమ్ కావడంతో ఈ నెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు శుక్రవారం ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఈయనకు బీజేపీలో టికెట్ ఇప్పించడంలో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తుంది.