అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతరాష్ట్ర  దొంగల ముఠా అరెస్టు
  • రాత్రి పూట నిద్రిస్తున్న వ్యక్తులే టార్గెట్‌‌‌‌గా దొంగతనాలు 
  • రూ. 5 లక్షల విలువ చేసే 4.25 తులాల బంగారం, రూ. 50 వేల వెండి స్వాధీనం

సూర్యాపేట, వెలుగు:  రాత్రిపూట నిద్రిస్తున్న వారి మెడల నుంచి బంగారు ఆభరణాలు దొంగతనం చేస్తున్న ముఠాను అర్వపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ నరసింహ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.  కొద్ది రోజులుగా సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని కొన్ని జిల్లాల్లో ఈ ముఠా దొంగతనాలు చేస్తోందన్నారు. అక్టోబర్ చివరి వారంలో అర్వపల్లి మండలంలో రెండు వరుస దొంగతనాలు జరగడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  సీసీఎస్ అర్వపల్లి పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. 

 వీరి నుంచి రూ.5 లక్షల విలువైన 4.25 తులాల బంగారం, రూ. 50 వేల విలువైన వెండి, రెండు బైక్‌‌‌‌లు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  విచారణలో వీరు ఆంధ్రప్రదేశ్‌‌‌‌కు చెందిన ఓలేటి మహాలక్షాల రావు, గద్దెడ సురేంద్ర, అల్లేటి రాజేష్, వెంద్ర రాఘవేంద్రరావుగా గుర్తించారు. ఈ ముఠా అర్వపల్లి, నాగారం, తుంగతుర్తి, శాలిగౌరారం పోలీస్‌‌‌‌స్టేషన్ పరిధుల్లో దొంగతనాలు చేసినట్లు, ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో మరో మూడు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు.

ప్రధాన నిందితుడు మహాలక్షాల రావుపై గతంలో 37 కేసులు ఉండగా, అతను కాకినాడ జైలు నుంచి  తప్పించుకున్నట్టు సమాచారం ఉందని ఎస్పీ తెలిపారు.  మిగతా ముగ్గురిపైనా అనేక కేసులు నమోదయ్యాయని చెప్పారు.  ఈ ముఠాను పట్టుకోవడంలో విశేష కృషి చేసిన సీసీఎస్, నాగారం, అర్వపల్లి పోలీసులను ఎస్పీ నరసింహ అభినందించి రివార్డులు అందజేశారు.