హైడ్రాను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కుట్రలు: మైనంపల్లి హనుమంతరావు

హైడ్రాను అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కుట్రలు: మైనంపల్లి హనుమంతరావు

గజ్వేల్/తొగుట, వెలుగు :  కాంగ్రెస్  ప్రభుత్వం హైదరాబాద్  ఉజ్వల  భవిష్యత్తు కోసం పని చేస్తుంటే కేటీఆర్, హరీశ్​రావు హైడ్రాను  అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మండిపడ్డారు. మంగళవారం గజ్వేల్​లోని ఆర్అండ్ఆర్​ కాలనీ, కొల్గూరు  గ్రామాన్ని సందర్శించి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల పేరిట గ్రామాలకు గ్రామాలను ఖాళీ చేపించి నిర్వాసితులను ఆగం చేశారని, హరీశ్​రావు ఏకంగా సీఎం సొంత నియోజకవర్గంలో దగ్గరుండి ఇండ్లు కూల్చి  తిరిగి వారి మొహం కూడా చూడలేదని మండిపడ్డారు. డ్రామాలు చేస్తున్న నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.

 సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి మల్లన్న సాగర్  నిర్వాసితులకు, కొల్గూరు లో ఇండ్లు కూల్చివేతతో నష్టపోయిన బాధితులకు న్యాయం చేస్తామన్నారు. హైడ్రా బాధితులకు డబుల్  బెడ్రూమ్  ఇండ్లు కట్టించి వారిని అన్ని విధాలుగా అనుకుంటామని తెలిపారు. సోషల్  మీడియా వేదికగా హైడ్రా బాధితులను రెచ్చగొట్టేలా బీఆర్ఎస్  ప్రయత్నం చేస్తోందని, దీనిని కాంగ్రెస్  శ్రేణులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. మల్లన్న సాగర్  భూ నిర్వాసితుడు మల్లారెడ్డి చితి పేర్చుకుని చనిపోయిన రోజు పట్టించుకోని కేసీఆర్,  కేటీఆర్, హరీశ్​రావు, ఇప్పుడు బస్  యాత్రలు చేస్తారంట అని ఎద్దేవా చేశారు. 

తెలంగాణ కోసం తాను చావడానికి రెడీగా ఉన్నానని, హరీశ్​రావు, కేటీఆర్  సిద్ధమా అని  సవాల్  చేశారు. విజయవాడ, కేరళ మాదిరిగా రాష్ట్రం ప్రళయాల బారిన పడొద్దని చెరువులు, కుంటలు, మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం పూనుకుంటే.. దీనిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు. చూస్తూ ఊరుకోవద్దని శ్రేణులకు సూచించారు. హరీశ్​రావు కొలుగూరులో దత్తత పేరుతో తానే ప్రొక్లయినర్​ నడుపుతూ ఇండ్లన్నీ కూల్చివేసి పేదలను రోడ్డున పడేస్తే, ఈ బాధతో ఇద్దరు మహిళలు చనిపోతే వారిని పరామర్శించలేదని గుర్తు చేశారు. ఇలాంటి వారు హైదరాబాద్​లో కన్నీరు కారుస్తూ డ్రామాలు చేస్తున్నారన్నారని విమర్శించారు.

అనంతరం గజ్వేల్  మండలం కొలుగూరు గ్రామంలో పర్యటించి హరీశ్​ రావు దత్తత పేరిట కూల్చి వదిలేసిన ఇండ్లను పరిశీలించి, బాధితులను పరామర్శించారు. కేసీఆర్, హరీశ్​రావు, ఎమ్మెల్సీ   వెంకట్రామిరెడ్డి కలసి మల్లన్న సాగర్  నిర్వాసితులను నిండా ముంచారని పేర్కొన్నారు. మల్లన్నసాగర్  నిర్వాసితులైన తుక్కాపూర్ గ్రామస్తులకు న్యాయం చేస్తామని తెలిపారు. హైడ్రా బాధితులపై  ప్రేమ ఉంటే వారి ఆస్తులు పేద ప్రజలకు ఇవ్వాలని, తన ఆస్తులను పేద ప్రజలకు ఇస్తానని సవాల్  చేశారు. గత ప్రభుత్వంలోనే హైదరాబాద్  సహా అన్ని జిల్లా కేంద్రాల్లో చెరువులు, కుంటలు అన్యాక్రాంతమయ్యాయని తెలిపారు.