కారుకు ఓటేస్తే మోరీలో వేసినట్లే : రఘునందన్​రావు

కారుకు ఓటేస్తే మోరీలో వేసినట్లే :  రఘునందన్​రావు

పాపన్నపేట,వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కారుకు ఓటేస్తే మోరీలో వేసినట్లే అని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్​రావు అన్నారు. ఆదివారం పాపన్నపేటలో బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై  మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ ఏడుపాయలకు రూ.100కోట్లు ఇస్తాననిచెప్పి మాటతప్పడన్నారు.

బీఆర్ఎస్​ఎంపీ గెలిస్తే  ఫాంహౌస్ కే పరిమితమవుతారని ఎద్దేవా చేశారు. అదే బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ దర్శన్ పథకం ద్వారా ఏడుపాయల ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. బీజేపీతోనే మెదక్ రైల్వే లైన్ సాధ్యమైందని,  జిల్లాలో జాతీయ రహదారులు వేసింది కేంద్ర ప్రభుత్వమేనన్నారు. గత ఎన్నికల్లో జరిగిన  పొరపాట్లు సరిదిద్దుకుని ప్రతీ కార్యకర్త గ్రామ నాయకుడై పనిచేయాలని పిలుపునిచ్చారు.

మెదక్ పార్లమెంట్​నుంచి బీజేపీ అభ్యర్థిని గెలిపించి ప్రధాని నరేంద్రమోదీకి బహుమతి ఇవ్వాలని కోరారు. పనిచేయని నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, అసెంబ్లీ ఇన్‌చార్జి విజయ్ కుమార్, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి ఎంఎల్ఎన్ రెడ్డి, మండలాధ్యక్షుడు రాములు, నాయకులు నందారెడ్డి, ధర్మారావు, సంతోష్ చారి పాల్గొన్నారు.