నల్గొండ బీజేపీలో చిన్నపరెడ్డి సిన్మా ! .. టికెట్​ఇస్తే వస్తానని హైకమాండ్‌‌కు సంకేతాలు

నల్గొండ బీజేపీలో చిన్నపరెడ్డి సిన్మా ! ..  టికెట్​ఇస్తే వస్తానని హైకమాండ్‌‌కు సంకేతాలు
  •     సైదిరెడ్డి వ్యతిరేకుల మద్దతు కూడగట్టే యత్నాలు
  •     కవిత ఎపిసోడ్‌‌తో మనసు మార్చుకున్న మాజీ ఎమ్మెల్సీ
  •     బీజేపీ కేడర్‌‌లో పరేషాన్‌‌

నల్గొండ, వెలుగు : నల్గొండ బీజేపీలోకి మాజీ ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తనకు నల్గొండ ఎంపీ టికెట్‌‌ ఇస్తే బీఆర్ఎస్‌‌కు రిజైన్‌‌ చేసి వస్తానని హైకమాండ్‌‌కు శనివారం సంకేతాలు పంపారు. ఇటీవలే మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి బీజేపీ నల్గొండ టికెట్‌‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతకుముందు చిన్నపరెడ్డి వస్తే టికెట్‌‌ ఇస్తామని బీజేపీ ఆఫర్‌‌ ఇచ్చినా ఆయన తిరస్కరించారు. తీరా బీఆర్ఎస్‌‌ రోజురోజుకు బలహీనపడ్తుండడం, తాజాగా కవిత అరెస్ట్‌‌తో చిన్నపరెడ్డి తన మనసు మార్చుకున్నారు. బీఆర్‌‌ఎస్‌‌ ఎంపీ టికెట్‌‌ ఇచ్చినా గెలిచే ఛాన్స్‌‌ లేదని భావించిన ఆయన బీజీపీ నేతలతో టచ్‌‌లోకి వెళ్లడం ఆసక్తి రేపుతోంది.

చిన్నపరెడ్డి వద్దన్నాకే సైదిరెడ్డికి టికెట్‌‌..

సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడానికి రెండు, మూడు రోజుల ముందు వరకు కూడా బీజేపీ నేతలు చిన్నపరెడ్డితో చర్చలు జరిపారు. కానీ బీఆర్‌‌ఎస్‌‌లో ఎంపీ టికెట్‌‌ ఖరారైనందున తాను రాలేనని, ఒకవేళ టికెట్‌‌ రాకపోతే  బీజేపీలో చేరుతానని స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతలు సైదిరెడ్డిని పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్‌‌ ఇచ్చారు. ఇది జరిగిన కొద్దిరోజుల వ్యవధిలోనే కవిత అరెస్ట్​కావడంతో చిన్నపరెడ్డి డైలామాలో పడ్డారు. బీఆర్‌ఎస్‌ టికెట్​ఇచ్చినా గెలిచే పరిస్థితి లేదని భావించిన ఆయన శనివారం బీజేపీ స్టేట్​ప్రెసిడెంట్‌‌ కిషన్‌‌ రెడ్డి, కేంద్ర నాయకులతో మాట్లాడారు. తనకు టికెట్‌‌ ఇస్తే వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. పార్టీలో చేర్చుకునేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదుగానీ ఎంపీ క్యాండిడేట్‌‌ను మార్చే అధికారం తమ చేతుల్లో లేదని, కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర నేతలు స్పష్టం చేసినట్టు తెలిసింది. దీంతో తన అభ్యర్థిత్వానికి జిల్లా స్థాయిలో మద్దతు లభిస్తే, రాష్ట్ర, జాతీయ స్థాయి నేతలను ఒప్పించవచ్చని భావించిన చిన్నపరెడ్డి స్థానిక నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా,  సైదిరెడ్డి అభ్యర్థిత్వం పట్ల నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని పార్టీ కేడర్​లో, సీనియర్​నేతల్లో కొంత వ్యతిరేకత ఉంది. దీంతో చిన్నపరెడ్డి అయితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదనే విషయాన్ని పలువురు సీనియర్లు రాష్ట్ర నాయకులకు చెప్పినట్లు తెలిసింది. 

పార్టీలో గందరగోళం

పార్లమెంట్​ ఎన్నికల నోటిఫికేషన్​వెలువడగానే ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి నేతృత్వంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల బీజేపీ అధ్యక్షులు, జిల్లా, రాష్ట్ర నాయకులు శనివారం పార్లమెంటరీ ఎన్నికల కమిటీ మీటింగ్‌‌ నిర్వహించారు. ఎన్నికల వ్యూహాలు, అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఆఫీసుల ఓపెనింగ్, పార్టీ కేడర్‌‌ను సమాయత్తం చేయడం గురించి తీర్మానాలు చేశారు. ఈ సమావేశానికి సీనియర్లు చింత రామచంద్రారెడ్డి, నూకల నర్సింహారెడ్డి, గోలి మధుసూదన్‌‌రెడ్డి, అధ్యక్షులు నాగం వర్షిత్‌‌రెడ్డి, బొబ్బ భాగ్యరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇలా ఓవైపు  మీటింగ్​ జరుగుతుండగానే మరోవైపు చిన్నపరెడ్డి ఎంపీ టికెట్​కోసం జిల్లా నేతల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో పార్టీలో గందరగోళ పరిస్థితి నెలకొంది.