క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉన్న..పార్టీ కోసం కష్టపడి పనిచేస్తా: కొండా మురళి

క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉన్న..పార్టీ కోసం కష్టపడి పనిచేస్తా: కొండా మురళి

హైదరాబాద్, వెలుగు: పీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. కమిటీ ముందుకు తానే వచ్చానని.. ఎవరూ పిలవలేదని ఆయన తెలిపారు. గాంధీ భవన్ లో చైర్మన్, ఎంపీ మల్లు రవి అధ్యక్షతన పీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ముగిసిన తర్వాత మల్లు రవి మీడియాతో మాట్లాడారు. సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ పరిస్థితులపై చర్చించామన్నారు. అనిరుధ్ రెడ్డి అంశంపై కూడా మాట్లాడినట్లు వివరించారు.

రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చ జరగలేదని, ఆయన వ్యాఖ్యలపై కమిటీకి ఎవరూ ఫిర్యాదు చేయలేదని తెలిపారు. అనంతరం కొండా మురళీ మాట్లాడారు. ‘‘రేవంత్ ని సీఎం చెయ్యాలని నేనే చెప్పాను. అదే కమిట్మెంట్ తో నేను పని చేస్తున్నాను. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్న. నేను ఇచ్చిన వివరణతో క్రమశిక్షణ కమిటీ సంతృప్తిగా ఉంది. పార్టీ ఆదేశాలు పాటిస్తానన్న. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం కష్టపడి పని చేస్తా. నేను ఎప్పుడూ రాజకీయ నేతల గురించి మాట్లాడలేదు. కేవలం ఆంధ్రా కాంట్రాక్టర్ల గురించే మాట్లాడిన. నేను ఏం మాట్లాడానో ఆ వీడియోను కమిటీకి పంపిస్తా’’అని కొండా మురళి అన్నారు.