వరంగల్ డిక్లరేషన్ తో కాంగ్రెస్కు బలం

వరంగల్ డిక్లరేషన్ తో కాంగ్రెస్కు బలం

జగిత్యాల: కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో రైతులను దోపిడి చేస్తున్నారని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. బుధవారం జిల్లాలోని మల్యాల మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మే 21న రాజీవ్ గాందీ వర్ధంతి సందర్భంగా రచ్చబండ పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... కొనుగోలు కేంద్రాల్లో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాళ్లకి భరోసా ఇచ్చేందుకు కార్యకర్తలు కల్లాల దగ్గరకు వెళ్లాలని పిలుపునిచ్చారు. వరి వేస్తే ఉరే అంటూ కేసీఆర్ చెప్పడం వల్లే చాలా మంది రైతులు వరి సాగు చేయలేదని, వాళ్లందరికీ ప్రభుత్వం నష్ట పరిహారం కల్పించాలని డిమాండ్ చేశారు.

చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని చెప్పిన కేసీఆర్ కు... కొనుగోలు కేంద్రాల్లో రైతుల కష్టాలు కనబడటం లేదా అని ప్రశ్నించారు. వరంగల్ డిక్లరేషన్ తర్వాత రైతులు, ప్రజల్లో కాంగ్రెస్ కు బలం పెరుగుతోందని... రాబోయే రోజుల్లో డిక్లరేషన్ గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించాలని కోరారు. ఒకరిపైనొకరు విమర్శించుకుంటూ టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. కుల మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నవారికి ప్రజలు బుద్ధి చెబుతారని, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తల కోసం...

సీపీఐ నేత బినోయ్ విశ్వంను అడ్డుకున్న పోలీసులు..

IAS, IPS అధికారులపై 18వేల కోర్టు ధిక్కరణ కేసులు