బీజేపీలో చేరనున్న మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్

బీజేపీలో చేరనున్న మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్
  • తరుణ్ చుగ్​తో నర్సయ్య గౌడ్​ సమావేశం   
  • రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ
  • బంగారు తెలంగాణే మా ఎజెండా: చుగ్
  • మరో తెలంగాణ మూమెంట్ మొదలైంది: నర్సయ్య

న్యూఢిల్లీ, వెలుగు: బంగారు తెలంగాణే తమ ఎజెండా అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. తొలి, మలి దశ తెలం గాణ పోరాటంలో ఆనాటి యువకులు కలలు కన్న బంగారు తెలంగాణ స్వప్నాన్ని కేసీఆర్ చోరీ చేశారన్నారు. బంగారు తెలంగాణకు బదులు, బం గారు కేసీఆర్ ఫ్యామిలీ నిర్మించుకున్నారని ఫైర్ అయ్యారు. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనను తరిమికొట్టాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. మంగళవారం ఢిల్లీ సౌత్​ ఎవెన్యూలోని తరుణ్​ చుగ్​ నివాసంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఆయన్ను కలిశారు. అర గంటకు పైగా సాగిన భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, మునుగోడు స్ట్రాటజీ, రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశాలపై చర్చించారు. అంతకు ముందు తరుణ్​చుగ్ మీడియాతో మాట్లాడారు. డాక్టర్ అయిన నర్సయ్య గౌడ్​ సమా జంలో చెత్తను క్లీన్ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని, ఉద్యమకారుడైన నర్సయ్యను బీజేపీలోకి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నామని చెప్పారు.

జనాన్ని కేసీఆర్ మోసగించిండు: చుగ్
సీఎం కేసీఆర్ కొడుకు, కూతురు, అల్లుడిని అందలం ఎక్కించేందుకు.. రాష్ట్ర భవిష్యత్​ను, తెలంగాణ ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డా రు. దళిత బంధు, ఓబీసీల అభివృద్ధి, డబుల్ బెడ్ రూం వంటి స్కీంలను అమలు చేయడంలో కేసీ ఆర్ ఫెయిల్​ అయ్యారన్నారు. లోటు బడ్జెట్ పెరిగిందని, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందన్నారు. రైతులు, కార్మికులు, డాక్టర్లు ఆందోళనలు చేస్తున్నారని, యువకులు, మహిళలు రోడ్లెక్కే పరిస్థితి వచ్చింద న్నారు. కానీ, కేసీఆర్ ప్రభుత్వం రేపిస్టులను కాపాడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ వాదులంతా ఒక్కటవుతున్నారని తరుణ్​చుగ్​ చెప్పారు.

ఫండ్స్​ తెచ్చేందుకే బీజేపీలోకి: బూర నర్సయ్య
కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో మరో తెలంగాణ మూమెంట్ మొదలైందని బూర నర్సయ్య గౌడ్ అన్నారు. చాలా మంది ఉద్యమకారులు, నేతలు బీఆర్ఎస్ (టీఆర్ఎస్)ను వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. గుజరాత్ కు మాత్రమే ఫండ్స్ వెళ్తున్నాయని కొందరు రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని, ఆ ఫండ్స్ ను తెలంగాణకు కూడా తెచ్చేందుకే తాను బీజేపీ వైపు వెళ్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. పదవులు, అవకాశాల కోసం బీజేపీలో చేరడం లేదన్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో వచ్చిన తెలంగాణలో ఉద్యమకారుల నోళ్లు నొక్కేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రగతిపథంలో నడవాలన్నా, ప్రపంచం పటంలో భారత్ బ్రహ్మాండంగా వెలగాలన్నా బీజేపీతోనే సాధ్యమన్నారు. అది ప్రధాని మోడీ నాయకత్వంలోనే జరుగుతుందని నమ్ముతున్నట్లు చెప్పారు. బీజేపీ హయాంలో తెలంగాణకు పూర్తి న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.

అమిత్​ షాతో భేటీకి చాన్స్​
బూర నర్సయ్య గౌడ్ బుధవారం బీజేపీలో చేరనున్నారు. ఉదయం 11:30కి ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు బీజేపీలో చేరనున్నారు. ఈ కార్యక్రమానికి తరుణ్ చుగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పలువురు కేంద్ర మంత్రులు హాజరుకానున్నారు. అనంతరం బీజేపీ నేషనల్​ చీఫ్ జేపీ నడ్డాను, కేంద్ర మంత్రి అమిత్ షాను నర్సయ్య కలిసే అవకాశం ఉంది.