ఈశ్వరమ్మపై దాడి, నాగన్న మృతిపై.. పోలీసుల దర్యాప్తు నామమాత్రమే : మిడియం బాబురావు

ఈశ్వరమ్మపై దాడి, నాగన్న మృతిపై.. పోలీసుల దర్యాప్తు నామమాత్రమే : మిడియం బాబురావు

కొల్లాపూర్,వెలుగు : మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మపై దాడి, నాగన్న మృతిపై పోలీసుల విచారణ నామమాత్రంగానే జరిపారని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్  జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ మిడియం బాబురావు ఆరోపించారు. మండలంలోని మొలచింతలపల్లి గ్రామాన్ని ఆదివారం సందర్శించారు. అనంతరం ఈశ్వరమ్మ ఘటన, నాగన్న మృతి, చెంచుల జీవన విధానంపై ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెంచులను గాలికి వదిలేశాయని విమర్శించారు. ఆదివాసీలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. చెంచులకు ఇచ్చిన భూములను లాక్కుంటున్నా ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. సీఎం సొంత జిల్లాలో ఐటీడీఏ పీవో పోస్టు ఖాళీగా ఉండడం సరైంది కాదన్నారు. 

విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెంచుపెంటల్లో అంగన్​వాడీ, హెల్త్  సెంటర్లు లేవని, పోషకాహారం అందించేందుకు ప్రాజెక్టు కూడా లేదన్నారు. దీంతో రక్తహీనతతో అనేక మంది చనిపోతున్నారని పేర్కొన్నారు. చెంచులకు పదెకరాల భూమి, సొంత ఇల్లు నిర్మించి ఇవ్వాలని, రూ.5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వర్ధం పర్వతాలు, శ్రీనివాస్, సచిన్, భీంరావు, బండారు రవికుమార్, దశరథం పాల్గొన్నారు.