గిరిజనుల మాన, ప్రాణాలకు వెలకడుతున్నరు : ఎంపీ రవీంద్ర నాయక్

గిరిజనుల మాన, ప్రాణాలకు వెలకడుతున్నరు : ఎంపీ రవీంద్ర నాయక్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో గిరిజనుల మాన, ప్రాణాలకు కేసీఆర్ సర్కార్ వెలకట్టే ప్రయత్నం చేస్తోందని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో అగ్ర వర్ణాలకు ఒక న్యాయం, బడుగులకు మరో న్యాయం దక్కుతోందని చెప్పారు. బీఆర్ఎస్ నేతల ఇంట్లోని మహిళలపై థర్డ్ డిగ్రీ, అత్యాచారాలు జరిగితే నష్ట పరిహారం తీసుకొని వదిలేస్తారా? అని ప్రశ్నించారు. గిరిజన బాధిత మహిళ వరలక్ష్మికి న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. శనివారం రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో గిరిజన బృందం లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసింది. 

ఈ సందర్భంగా ఎల్బీ నగర్ పీఎస్‌‌లో గిరిజన మహిళపై జరిగిన దాడిని స్పీకర్‌‌‌‌కు వివరించగా, ఆయన విచారం వ్యక్తం చేశారు. అలాగే, లంబాడాల రిజర్వేషన్లపై బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలపై స్పీకర్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌‌‌‌తో భేటీ అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్‌‌లో రవీంద్ర నాయక్ మీడియాతో మాట్లాడారు. లంబాడాల రిజర్వేషన్లపై మాట్లాడుతున్న బాపురావు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ఆయన ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు.