కేసీఆర్‌‌‌‌కు అహంకారం పెరిగింది: వివేక్ వెంకటస్వామి

కేసీఆర్‌‌‌‌కు అహంకారం పెరిగింది: వివేక్ వెంకటస్వామి
  • మోడీ సభను అడ్డుకుంటామని కొన్ని పార్టీలు ప్రకటించడం సిగ్గుచేటు
  • రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటున్నదని ఫైర్

మందమర్రి/బెల్లంపల్లి, వెలుగు: ప్రధాని మూడు సార్లు రాష్ట్రానికి వస్తే కేసీఆర్ కలవలేదని, కనీస మర్యాద ఇవ్వలేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కేసీఆర్‌‌‌‌కు అహంకారం పెరిగిందని, ఆయన మాటలపై ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. రాజకీయ కారణాలతో రామగుండంలో ప్రధాని మోడీ సభను అడ్డుకుంటామని కొన్ని పార్టీలు ప్రకటించడం సిగ్గు చేటన్నారు. దేశాభివృద్ధికి పాటుపడుతున్న ప్రధానిని అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. గురువారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మున్సిపాలిటీలోని బీజేపీ ఆఫీస్‌‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో, బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్‌‌లో వివేక్ మాట్లాడారు. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌‌సీఎల్) తో రైతుల్లో భరోసా పెరిగిందని, ఎలాంటి కొరత లేకుండా ఎరువులను పొందేందుకు అవకాశం వచ్చిందని ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. 12న ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు

‘‘12.5 మిలియన్ టన్నుల ఉత్పత్తితో తెలంగాణలో యూరియా కొరత తీరుతుంది. గతంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునేది. ఇప్పుడు అలాంటి సమస్య ఉండదు. రామగుండం ఎరువుల కర్మాగారం తిరిగి ప్రారంభం కానుండడంతో రైతుల్లో భరోసా నిండింది’’ అని వివేక్ వెంకటస్వామి అన్నారు. దేశాభివృద్ధికి కృషి చేస్తున్న మోడీ.. ప్రపంచంలో ఉత్తమ ప్రధాని అని కొనియాడారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. తాను పెద్దపల్లి ఎంపీగా కొనసాగిన కాలంలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొత్త రైళ్ల ఏర్పాటు, రైల్వేస్టేషన్లలో పలు రైళ్లకు హాల్టింగ్ కల్పించినట్లు గుర్తు చేశారు. 

వివేక్‌‌ను సన్మానించిన బీజేపీ క్యాడర్

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోసం అహర్నిశలు కృషి చేసిన వివేక్ వెంకటస్వామిని బీజేపీ క్యాడర్ సన్మానించింది. రామకృష్ణాపూర్ టౌన్ బీజేపీ ప్రెసిడెంట్ మహంకాళీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లీడర్లు, కార్యకర్తలు శాలువ కప్పి వివేక్‌‌ను సత్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి, పెద్దపల్లి పార్లమెంట్ కో కన్వీనర్ వెంకటేశ్వర్​ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు అందుగుల శ్రీనివాస్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

గనులను ప్రైవేటుకిచ్చేందుకు కేసీఆర్ పన్నాగం

రాష్ట్రంలో రెండు లక్షల జాబ్స్ భర్తీ చేయాల్సి ఉందని, కానీ ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్నారని వివేక్ విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయకుండా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, పోడు భూములకు పట్టాలివ్వడం లేదని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో కాళేశ్వరం, మిషన్ భగీరథల నుంచి వేల కోట్ల రూపాయల కమీషన్లు పొందారు. లిక్కర్ స్కామ్‌‌కు పాల్పడ్డారు. రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటున్నది” అని ఫైరయ్యారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పన్నాగం పన్నారని వివేక్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లాలోని తాడిచెర్ల బొగ్గు బ్లాక్‌‌ను ఏఎమ్మార్ కంపెనీకి అప్పగించి, అక్కడ టన్ను బొగ్గు ధర రూ.3,500కి పెంచి సీఎం కేసీఆర్ రూ.20 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. టీఆర్ఎస్ సర్కార్ వచ్చే నాటికి సింగరేణిలో 62,000 మంది కార్మికులు ఉండగా.. ఇప్పుడు సంఖ్యను 42 వేలకు తగ్గించారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ సింగరేణిని ప్రైవేటుపరం చేస్తామని చెప్పలేదన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశవ్యాప్తంగా బొగ్గు గనుల కేటాయింపునకు టెండర్ల ప్రక్రియ సాగుతున్నదని చెప్పారు.