సీఎం కేసీఆర్ అవినీతిలో నెంబర్​ 1

సీఎం కేసీఆర్ అవినీతిలో నెంబర్​ 1
  • తాడిచర్లలో   రూ. 20 వేల కోట్ల అవినీతి 
  • సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తామని బీజేపీ చెప్పలే 
  • టీఆర్ఎస్ గ్రాఫ్ కిందకు.. బీజేపీ గ్రాఫ్ పైకి పోతోంది  

లక్సెట్టిపేట(మందమర్రి), వెలుగు:   దేశంలో నెంబర్ వన్ అవినీతి సీఎం కేసీఆర్ అని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. టీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ గ్రాఫ్ క్రమేణా పడిపోతుండగా, బీజేపీ గ్రాఫ్​ పెరుగుతోందన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. హైదరాబాద్ లో జులై 2, 3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్న క్రమంలో శనివారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్​లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ శక్తి కేంద్రాల ఇంచార్జుల సమావేశానికి వివేక్ వెంకటస్వామి చీఫ్ గెస్ట్​గా హాజరయ్యారు. సమావేశంలో ముందుగా జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ ప్రోత్సాహంతో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు. సమస్యలు, ఇబ్బందులపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కాన్వాయ్​పై ఓ రైతు చెప్పులు విసిరి నిరసన తెలిపాడని, టీఆర్ఎస్ పట్ల ప్రజలు విసుగు చెందారనడానికి ఇదే నిదర్శనమన్నారు. 

కాళేశ్వరం వెనక.. 40 వేల ఎకరాల మునక  

సీఎం కేసీఆర్ కమీషన్ల కోసమే రూ.30 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా రీడిజైన్ చేశారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ. లక్ష కోట్లకు పెంచి కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డికి లాభం చేసి, జనంపై భారం మోపారన్నారు. రీడిజైన్ వల్ల ఏటా రూ.10 వేల కోట్ల వడ్డీ భారం పడుతోందన్నారు. కాళేశ్వరం బ్యాక్​వాటర్ వల్ల చెన్నూరు నియోజకవర్గంలో 40 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగిందని, మూడేండ్లుగా రైతులు నష్టపోతున్నా ఇప్పటి వరకు పరిహారం అందలేదన్నారు. తాడిచెర్ల ఓపెన్​కాస్ట్ గనిలో రూ.20వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనికి సీఎం కేసీఆర్ నిర్వాకమే కారణమన్నారు. టన్ను బొగ్గుకు రూ.700 ఇవ్వాల్సి ఉండగా ఆంధ్ర కాంట్రాక్టర్​కు టన్నుకు రూ.3,200 ఇస్తున్నాడని ఆరోపించారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తానని కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎప్పుడూ చెప్పలేదన్నారు. 

సమావేశాలను సక్సెస్ చేయాలె 

రాష్ట్రంలో రెండేళ్లుగా బీజేపీ బలోపేతం అవుతోందని, దీనికి పార్టీ కేడర్ సమిష్టి కృషి, ప్రధాని మోడీ నీతివంతమైన పాలన, పథకాలే కారణమని వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ కార్యకర్తలకు క్రమశిక్షణ, కష్టపడే గుణం ఉంటుందన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను, పబ్లిక్ మీటింగ్​ను విజయవంతం చేయాలని పార్టీ కేడర్​కు పిలుపునిచ్చారు. పబ్లిక్ మీటింగ్​కు ప్రజలను తరలించేందుకు శక్తి కేంద్రాల ఇంచార్జులు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ అన్నారు. సమావేశంలో బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్ రఘునాథ్ వెరబెల్లి, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిపాభాద్ జిల్లాల పార్టీ అధ్యక్షులు పాయల్ శంకర్, రమాదేవి, పాల్వాయి హరీశ్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జులు పల్లె గంగా రెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, ఆదిలాబాద్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, బీజేవైఎం జిల్లా​ ప్రెసిడెంట్​ పట్టి వెంకటకృష్ణ పాల్గొన్నారు.