తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు..మాజీ ఎంపీటీసీకి రెండేండ్ల జైలు

తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు..మాజీ ఎంపీటీసీకి రెండేండ్ల జైలు

హైదరాబాద్‌‌, వెలుగు :  తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు కీసర మండలం గోధుమకుంట్ల మాజీ ఎంపీటీసీ మంచాల పెంటయ్యకు నాంపల్లి కోర్టు రెండేండ్ల జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధించింది. చీఫ్‌‌ మెట్రోపాలిటన్ మెజి స్ట్రేట్‌‌ కోర్ట్‌‌ జడ్జి డి.దుర్గాప్రసాద్‌‌ మంగళవారం తీర్పు చెప్పారు. రెండు సెక్షన్‌‌ల కింద శిక్షలు ఖరారు చేశారు. కేసు వివరాలను ఏసీబీ హెడ్‌‌క్వార్టర్స్‌‌ వెల్లడించింది. మేడ్చల్‌‌ జిల్లా కీసర మండలం గోధుమకుంట్లకు చెందిన మంచాల పెంటయ్య గతంలో ఎంపీటీసీగా పనిచేశాడు. ఓ కేసు విషయంలో అప్పటి కీసర ఇన్‌‌స్పెక్టర్ కె.ప్రసాద్‌‌ లంచం డిమాండ్‌‌ చేశాడంటూ 2005లో ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. 

పెంటయ్య ఇచ్చిన సమాచారంతో చేర్యాలలోని ఓ దాబాలో రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ప్రసాద్‌‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసి 2007లో చార్జ్​షీట్ దాఖలు చేశారు. కేసుపై ఏసీబీ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. ఈ టైమ్​లో పెంటయ్య తప్పుడు సాక్ష్యం చెప్పాడు. నిందితుడు ప్రసాద్‌‌కు అనుకూలంగా వ్యవహరించాడు. దీంతో ప్రసాద్‌‌పై నమోదైన కేసును కోర్టు కొట్టేసింది.