మెదక్ జిల్లాలో బీఆర్ఎస్​కు బిగ్​షాక్​

మెదక్ జిల్లాలో బీఆర్ఎస్​కు బిగ్​షాక్​
  • ముఖ్యమంత్రిని కలిసిన నర్సాపూర్​మాజీ ఎమ్యెల్యే మదన్ రెడ్డి
  • కాంగ్రెస్​లో చేరిక ఇక లాంఛనమే
  • వెంట నడవనున్న జిల్లా ముఖ్య నేతలు

మెదక్, నర్సాపూర్​, వెలుగు: మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలానికి చెందిన ఫుడ్​కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన వెంట మల్కాజ్​గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు​, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి​ఆవుల రాజిరెడ్డి ఉన్నారు. మదన్​రెడ్డి వెంట హత్నూర జడ్పీటీసీ మెంబర్​ ఆంజనేయులు, కౌడిపల్లి మండల బీఆర్ఎస్​ లీడర్లు నర్సింహారెడ్డి, కాంగ్రెస్​ లీడర్లు, చిలప్​చెడ్ మాజీ జడ్పీటీసీ శేషసాయిరెడ్డి ఉన్నారు. 

అసెంబ్లీ టికెట్ నిరాకరించినప్పటి నుంచే..

మదన్​రెడ్డి తెలంగాణ ఉద్యమ కాలం నుంచే టీఆర్ఎస్​లో ఉన్నారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్​తరపున నర్సాపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీకి సిద్ధంగా ఉన్నప్పటికీ హైకమాండ్​ టికెట్​నిరాకరించి 2019లో కాంగ్రెస్​నుంచి టీఆర్ఎస్​లో చేరిన సునీతారెడ్డికి ఇచ్చింది. దీంతో మదన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అప్పుడే ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. అయితే, బీఆర్ఎస్​ హైకమాండ్ వచ్చే పార్లమెంట్​ఎన్నికల్లో మెదక్​ఎంపీ టికెట్​ఇస్తామనే హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గి బీఆర్ఎస్​అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన మాట తప్పి ఎంపీ టికెట్​మదన్​రెడ్డికి ఇవ్వకుండా ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్​వెంకట్రామిరెడ్డికి కేటాయించింది. దీంతో నారాజ్​అయిన మదన్ రెడ్డి బీఆర్ఎస్​ ను వీడాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల కింద మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు​ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. దీంతో ఆయన కాంగ్రెస్​లోకి వెళ్లనున్నారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీశ్ రావు, నర్సాపూర్​ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కౌడిపల్లిలోని మదన్​రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడారు. పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని కోరారు. కానీ, మదన్​రెడ్డి మాత్రం బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరాలని డిసైడ్​అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్​ రెడ్డిని కలిశారు. దీంతో ఆయన కాంగ్రెస్​ లో చేరడం ఖాయమని తేలిపోయింది. నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి రెండు రోజుల్లో కాంగ్రెస్​లో చేరనున్నట్టు తెలిసింది.