న్యూఢిల్లీ: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్.. తన ఆత్మకథ ‘బ్లాక్ అండ్ వైట్’లో ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నాడు. ‘2011 ఐపీఎల్ టైమ్‌లో నేను, ద్రవిడ్ కలిసి రాజస్తాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌కు వెళ్లాం. ఆ సందర్భంగా మీరు ఎన్నిసార్లు పులులను చూశారని ద్రవిడ్‌ను అడిగా. అప్పుడు నేను 21సార్లు సఫారీ టూర్‌కు వెళ్లినా ఒక్కసారి కూడా పులిని చూడలేదని చెప్పాడు. ఆ తర్వాత అందరం కలిసి ఓపెన్ టాప్ జీపులో సఫారీకి వెళ్లాం. మా వెనకాల చాలా మంది పర్యాటకులు వచ్చారు. వంద మీటర్లు దూరంలో పులిని చూశాం.
అయితే అప్పటివరకు పులుల ఫొటోల కోసం చూస్తున్న అభిమానులు ద్రవిడ్ కనిపించగానే తమ కెమెరాలన్నీ అతని వైపు తిప్పారు. ఎదురుగా అరుదైన పులి కనిపించినా పెద్దగా పట్టించుకోకుండా ద్రవిడ్‌ను చూడటానికి, ఫొటోలు తీయడానికి పోటీపడ్డారు. అది చూశాక ఇండియాలో క్రికెటర్లను ఇంతలా అభిమానిస్తారా అని నాకు ఆశ్చర్యమేసింది. ప్రపంచంలో 4 వేల పులులు ఉండి ఉంటాయి. కానీ వాటన్నిటి కంటే ద్రవిడ్ ప్రత్యేకమైన వ్యక్తి అని నాకు అప్పుడు అనిపించింది’ అని టేలర్ రాసుకొచ్చాడు.
