డీజీపీ, ఏజీని తొలగించాల్సిందే

డీజీపీ, ఏజీని తొలగించాల్సిందే
  • మరోసారి డిమాండ్​ చేసిన సిద్ధూ
  • లేదంటే ప్రజల్లో తలెత్తుకు తిరగలేమని ట్వీట్​

చండీగఢ్: పంజాబ్​ కొత్త డీజీపీ, అడ్వొకేట్​ జనరల్​ను తొలగించాల్సిందేనని పీసీసీ మాజీ చీఫ్​ నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ మరోసారి డిమాండ్​ చేశారు. వాళ్లను తొలగించకపోతే ప్రజల్లో తలెత్తుకు తిరగలేమని అన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ట్వీట్​ చేశారు. ‘మత గ్రంథాన్ని అవమానించారనే కేసులో న్యాయం కోసం, డ్రగ్స్​ కేసులో ప్రధాన నిందితులను పట్టుకోవాలని డిమాండ్​చేసినందుకు, పోరాటం చేసినందుకే మన ప్రభుత్వం 2017లో అధికారంలోకి వచ్చింది. వీటిల్లో విఫలం కావడం వల్లే అప్పటి సీఎంను ప్రజలు ఓడించారు. ఇప్పుడు అడ్వొకేట్​ జనరల్​ను, డీజీపీని నియమించడమంటే ఆనాటి బాధితుల గాయాలపై కారం చల్లడమే’నని సిద్ధూ  ట్వీట్​ చేశారు. లేకపోతే ప్రజల్లో తలెత్తుకు తిరగలేమని అన్నారు. కొత్త సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రభుత్వం డీజీపీగా ఇక్బాల్‌ ప్రీత్‌సింగ్‌ సహోతాను, అడ్వొకేట్‌ జనరల్‌గా అమర్‌ప్రీత్‌సింగ్‌ డియోల్‌ను నియమించడాన్ని సిద్ధూ వ్యతిరేకించారు. 2015లో గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అవమానించారనే కేసులో అకాలీ ప్రభుత్వం టైంలో ఏర్పాటైన సిట్‌కు సహోతా నేతృత్వం వహించారు. మరోవైపు వివాదాస్పద మాజీ డీజీపీ సమేధ్‌సింగ్‌ సెయినీ తరఫున డియోల్‌ వాదనలు వినిపించారు. వీళ్ల నియామకాల ద్వారా ప్రతిపక్షాల చేతికి ఆయుధాన్ని ఇచ్చినట్లు అవుతుందని సిద్ధూ వ్యతిరేకించి పీసీసీ పదవికి రాజీనామా చేశారు. దీంతో సిద్ధూతో భేటీ అయిన సీఎం చన్నీ సమస్యను చర్చించి పరిష్కరించుకుందామన్నారు. దానికి ఒప్పుకున్న సిద్ధూ మళ్లీ తాజాగా మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు.