
- 50 నాటౌట్‌గా నిలిచిన సునీల్ గావస్కర్
న్యూఢిల్లీ: సునీల్ గావస్కర్…ఇండియన్ క్రికెట్‌లో ఓ లెజెండ్. ఆల్‌టైమ్ వరల్డ్ గ్రేట్ క్రికెటర్ల లిస్ట్‌లోనూ ముందు వరుసలో ఉంటాడు. ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా ఇండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించిన సన్నీ…తన జీవితాన్ని క్రికెట్‌కు అంకితం చేశాడు. క్రికెటర్, రెఫరీ, కాలమిస్ట్, కామెంటేటర్ అంటూ ఏదో ఒక రూపంలో ఐదు దశాబ్దాలుగా ఇండియన్ క్రికెట్‌తో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో జట్టుకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాడు. 1971 మార్చి 6న మొదలైన గావస్కర్ ఇండియన్ క్రికెట్ జర్నీ.. శనివారం నాటికి సరిగ్గా 50 ఏళ్లు పూర్తయింది. 1987 నవంబర్‌లో ప్లేయర్‌గా ఆటకు గుడ్‌బై చెప్పిన లిటిల్ మాస్టర్.. తన కెరీర్‌లో 125 టెస్టులు ఆడి..10,122 రన్స్ చేశాడు. ఇందులో 34 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలున్నాయి. వీటితో పాటు నాలుగు వన్డే మ్యాచ్‌ల కూడా ఆడిన సన్నీ తన17 ఏళ్ల క్రికెటింగ్ కెరీర్‌లో ఏనాడూ హెల్మెట్ ధరించలేదు. మైఖేల్ హోల్డింగ్, మాల్కమ్ మార్షల్, జెఫ్ థామ్సన్ వంటి భయంకరమైన పేసర్లు షార్ట్ బాల్స్ వేసినా భయపడలేదు. ఇక, ఆటగాడి కెరీర్ ముగించాక.. ఓ టెస్ట్, ఐదు వన్డే మ్యాచ్‌ల్లో రెఫరీగా సేవలందించాడు.
అమితాబ్, కిషోర్ కుమార్ సరసన చేరిస్తే గర్వపడతా
ఇండియా జెర్సీ ధరించి 50 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సన్నీ… క్రికెట్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ‘అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ ఓ ఐకాన్. అలాగే సింగర్ కిషోర్ కుమార్‌ను ఎప్పటికీ మరచిపోలేం. 1970ల్లో వారిద్దరి హవా నడిచింది. అదే టైమ్‌లోనే నేను క్రికెట్‌లోకి వచ్చి రాణించా. కాబట్టి వాళ్ల సరసన నన్ను చేర్చాలన్న ఆలోచన వచ్చినా సరే చాలా గర్వంగా ఫీలవుతా. తొలిసారి ఇండియా క్యాప్ ధరించినప్పుడు చాలా ఆనందపడ్డా. కానీ సర్ గ్యారీ సోబర్స్ కెప్టెన్సీలోని విండీస్ ప్రత్యర్థి కావడంతో కాస్త టెన్షన్ ఫీలయ్యా. అరంగేట్ర సిరీస్‌లో 774 రన్స్ చేశా. నిజానికి 350–400 రన్స్ చేసినా నేను హ్యాపీగానే ఫీలయ్యేవాడిని. ఎందుకంటే ఆ టైమ్‌లో నాలో సత్తా ఉందని ప్రూవ్ చేసుకుంటే చాలు అనుకున్నా. ఇక, దిలీప్ సర్దేశాయ్, అజిత్ వాడేకర్ రిటైర్మెంట్ ప్రకటించేదాకా నాకు ఒత్తిడి అంటే ఏంటో తెలియదు. కానీ ఆ తర్వాత గుండప్ప విశ్వనాథ్‌తో కలిసి జట్టుకు మంచి స్కోర్లు అందించా. ప్రత్యర్థి బౌలర్ ఎంతటివాడైనా సరే నాకు అనవసరం. అతను విసిరే బౌన్సర్లకు భయపడేవాడ్ని కాదు. షాట్ కొట్టేందుకు ఓ చాన్స్ దొరికిందని అనుకునేవాడ్ని. క్లబ్ కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఇదే పద్ధతి కొనసాగించా. ఇక, కాలంతో పాటు ఆట మారిన విధంగా కామెంట్రీలో కూడా చాలా మార్పులు వచ్చాయి’ అని గావస్కర్ చెప్పుకొచ్చాడు.