లంక మాజీ అధ్యక్షుడికి కట్టుదిట్టమైన భద్రత

లంక మాజీ అధ్యక్షుడికి కట్టుదిట్టమైన భద్రత

కొలంబో: శ్రీలంక చేరుకున్న గోటబయ రాజపక్సకు మాజీ అధ్యక్షుడి హోదాకు తగ్గట్లు ప్రభుత్వం భద్రత కల్పించింది. గవర్నమెంట్​ బంగ్లాలో వసతి ఏర్పాటు చేసింది. గోటబయ రాజపక్స శుక్రవారం అర్దరాత్రి బండారనాయక ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టులో దిగారు. బ్యాంకాక్​ నుంచి బయలుదేరిన ఆయన, సింగపూర్​ మీదుగా శ్రీలంక చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీలంక పొదుజన పెరమున (ఎస్ఎల్​పీ) పార్టీ చట్ట సభ్యులు, నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

నుగేగోడాలోని తన ప్రైవేట్ ఇంటికి గోటబయ వెళ్లాలనుకున్నారని, భద్రతాపరమైన అంశాల కారణంగా ఆయన్ను ప్రభుత్వ నివాసానికి తరలించామని అధికారులు తెలిపారు. 2019లో అధ్యక్షుడైన తర్వాత కూడా గోటబయ అక్కడే ఉండేవారని చెప్పారు. శ్రీలంకలో అడుగుపెట్టిన వెంటనే.. ఆయన్ను భారీ భద్రత మధ్య సిన్నమోన్​ గార్డెన్స్​లోని గవర్నమెంట్​ బంగ్లాకు తీసుకెళ్లారని వివరించారు.

రాజ్యాంగపరంగా మాజీ అధ్యక్షులకు కల్పించాల్సిన అన్ని సౌలత్​లు అందజేశామన్నారు.   సింగపూర్​ ఎయిర్​లైన్స్​ ద్వారా గోటబయ బండారనాయక ఎయిర్​పోర్టుకు శుక్రవారం రాత్రి 11.30 గంటలకు చేరుకున్నారని డ్యూటీ మేనేజర్​ తెలిపారు.