
సిని నటి, బీజేపీ మాజీ ఎంపీ జయప్రద ఈరోజు రాంపూర్ కోర్టులో లొంగిపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జయప్రదపై 2 కేసులు నమోదయ్యాయి. ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఆమెపై రాంపూర్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమెకు కోర్టు చాలాసార్లు సమన్లు, వారెంట్లు జారీ చేసింది. అయినా కానీ ఎన్నో వాయిదాలకు జయప్రద హజరుకాలేదు. దాంతో న్యాయస్థానం ఆమెపై వారెంట్ జారీ చేసింది. ఆపై నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఇంత జరిగినా ఆమె కోర్టుకు హాజరు కాలేదు. మాజీ ఎంపీ జయప్రదపై కోర్టు ఏడుసార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది.
ఈ మేరకు రాంపూర్ కోర్టు ఫిబ్రవరి 27న ఆగ్రహం వ్యక్తం చేస్తూ కఠిన వైఖరి ప్రదర్శిస్తూ, మాజీ ఎంపీ, నటి జయప్రద పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. ఆమెపై సీఆర్పీసీ 82 సెక్షన్ కింద చర్యలు తీసుకుంటూ, ఒక డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి, జయప్రదను వచ్చేనెల ఆరో తేదీన కోర్టులో హాజరుపరచాలని రాంపూర్ పోలీసు సూపరింటెండెంట్ ని ఆదేశించింది. దీంతో జయప్రద ఈరోజు (మార్చి 4)న రాంపూర్ కోర్టులో లోంగిపోయారు.