ప్రజలు బిచ్చగాళ్లు అయితున్నరు.. కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదస్పద వ్యాఖ్యలు

ప్రజలు బిచ్చగాళ్లు అయితున్నరు.. కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదస్పద వ్యాఖ్యలు

భోపాల్: ప్రభుత్వాలు ఇచ్చే ఉచితాలకు అలవాటు పడి ప్రజలు బిచ్చగాళ్ల అయిపోతున్నారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ పటేల్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉచితాలపై అధికంగా ఆధారపడటం సమాజాన్ని బలోపేతం చేయడానికి బదులుగా బలహీనపరుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం (మార్చి 2) మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో వీరాంగన రాణి అవంతిబాయి లోధి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రహ్లాద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజలు ప్రభుత్వం నుండి అడుక్కోవడం అలవాటు చేసుకున్నారు. 

నాయకులకు కలిసి వారికి ఒక దండం వేయడం.. ఆ తర్వాత వారికి వినతి పత్రాలు ఇవ్వడం. ఇది మంచి అలవాటు కాదు. ప్రజలు అడగడానికి బదులుగా ఇచ్చే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి. ఇది సంతోషకరమైన జీవితానికి దారితీస్తుంది. అలాగే.. సంస్కారవంతమైన సమాజాన్ని నిర్మించడంలో సహాయపడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను’’ అని హాట్ కామెంట్స్ చేశారు. 

ఉచితాలపై అధికంగా ఆధారపడే ఈ యాచకుల సైన్యం సమాజాన్ని బలోపేతం చేయడానికి బదులు బలహీనపరుస్తోందని అన్నారు. ఉచిత వస్తువుల పట్ల ఆకర్షణ ధైర్యవంతుల లక్షణం కాదన్నారు. మన విలువలకు అనుగుణంగా జీవించినప్పుడే సమాజంలో నిజంగా గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. ప్రహ్లాద్ పటేల్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీతు పట్వారీ ప్రహ్లాద్ పటేల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

ప్రహ్లాద్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలను అవమానించడమేనని అన్నారు. ప్రజలను బిచ్చగాళ్ళు అని పిలిచే స్థాయికి బీజేపీ నేతల అహంకారం పెరిగిపోయిందని ఫైర్ అయ్యారు. ప్రహ్లాద్ వ్యాఖ్యలు పేదలను అవమానించడమేనని అన్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన తప్పుడు వాగ్ధానాలను అమలు చేయాలని అడిగితే.. సిగ్గు లేకుండా ప్రజలను బిచ్చగాళ్లు అని మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.