రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు.. శత్రువులు కాదు: వెంకయ్య

రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు.. శత్రువులు కాదు: వెంకయ్య

మహబూబ్ నగర్: రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని... శత్రువులు ఉండరని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జిల్లాలో నిర్వహించిన  ఓ కార్యక్రమంలో పాల్గొన్న  వెంకయ్య అనంతరం మాట్లాడారు. నేటి రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు లోపించాయని  ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతమైన ఆలోచనలు, నీతి, నిజాయితీతో దేశ గొప్పదనాన్ని కాపాడాలని రాజకీయ నాయకులను కోరారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్లమెంటరీ వ్యవస్త కలిగిన దేశం మనదని, చట్ట సభల్లో మాట్లాడేటప్పుడు నాయకులు ప్రజలను దృష్టిలో పెట్టుకొని హుందాగా వ్యవహరించాలన్నారు. కష్టపడితే విద్యార్థులు సాధించలేనిదేమీ లేదని, పట్టుదలతో దేన్నైనా పొందవచ్చని చెప్పారు.

మాతృభాష చాలా గొప్పదన్న వెంకయ్య... ప్రాథమిక స్థాయి వరకు విద్యార్థులకు  మాతృభాషలోనే బోధన జరగాలని అభిప్రాయపడ్డారు. తాను, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలమని, కానీ తాము మాతృ భాషలో మాట్లాడటానికే ఇష్టపడేవాళ్లమని చెప్పారు.  మాతృభాషను ప్రేమించాలని, ఇతర భాషలను గౌరవించాలని సూచించారు. కన్న తల్లి, జన్మభూమి, మాతృదేశాన్ని మరిచినోడు మానవుడే కాదని స్పష్టం చేశారు.