
- ఎక్కడపడితే అక్కడ బారికేడ్లు, ట్రాఫిక్ డైవర్షన్లు
- ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్ క్లోజ్
- అమీర్ పేట్ నుంచి అబిడ్స్ దాక.. సికింద్రాబాద్ నుంచి మెహిదీపట్నం దాక ట్రాఫిక్ జామ్
హైదరాబాద్, వెలుగు: ఒకవైపు ఫార్ములా – ఈ కార్ రేసింగ్.. మరోవైపు మంత్రుల కాన్వాయ్‌లు హైదరాబాద్ సిటీ జనాలకు నడిరోడ్డుపైనే నరకం చూపిస్తున్నాయి. మెయిన్ రోడ్లలో ట్రాఫిక్ జామ్‌లకు కారణమైతున్నాయి. మామూలుగానే నిత్యం రద్దీగా ఉండే రోడ్లలో వాహనదారులు ఈ నెల 7వ తేదీ నుంచి మరిన్ని ట్రాఫిక్ కష్టాలతో అరిగోస పడుతున్నారు. శని, ఆదివారాల్లో ఈ–కార్ రేసింగ్ పోటీలు ఉండడంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. ఓ వైపు కార్ల రేసింగ్ మరోవైపు అసెంబ్లీ సమావేశాలు వాహనదారులను, ట్యాంక్‌బండ్, హుస్సేన్ సాగర్‌కు వచ్చే టూరిస్టులను అసహనానికి గురిచేస్తున్నాయి. అడుగడుగునా బారికేడ్లు, ఎక్కడికక్కడ రోడ్లను క్లోజ్ చేయడంతో మెయిన్ రూట్లలో ట్రావెలింగ్ అంటేనే నగరవాసులు ఉలిక్కిపడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అయితే, కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సచివాలయం ఓపెనింగ్ జరిగే 17వ తేదీ వరకూ ఈ ట్రాఫిక్ కష్టాలు తప్పేటట్లు లేవు.
కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ లు
సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే రోడ్లు ఈ–రేసింగ్‌తో మరింత రద్దీగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ఉద్యోగులు, వ్యాపారులు, స్టూడెంట్స్, బస్సుల్లో ప్రయాణించేవారు ఇలా ప్రతి ఒక్కరు ఈ–రేసింగ్‌తో ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ రోజుల కంటే అర గంట ఎక్కువగా ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, మెహిదీపట్నం, ట్యాంక్‌బండ్ ఏరియాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది.
రేసింగ్, కాన్వాయ్‌లతో తిప్పలు
అసెంబ్లీ సమావేశాలు సైతం నగరవాసులకు తిప్పలు తెచ్చిపెట్టాయి. మంత్రులు, ఎమ్మెల్యేల కాన్వాయ్‌లు, వీఐపీ మూవ్‌మెంట్స్‌తో ట్రాఫిక్ జామ్ లు కామన్ అయిపోయాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఖైరతాబాద్, లక్డీకాపూల్ రూట్లలోనే అసెంబ్లీకి వస్తుంటారు. దీంతో బంజారాహిల్స్‌లోని మంత్రుల క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నారు. కాన్వాయ్ వెళ్లిన తరువాత ట్రాఫిక్ వదులుతున్నారు. సెషన్ ప్రారంభానికి ముందు విడతల వారిగా గంటసేపు ఇదే పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, నెక్లెస్ రోడ్ సహా ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నారు. రేసింగ్ జరిగే ఎన్టీఆర్ మార్గ్‌ను పూర్తిగా క్లోజ్ చేశారు. ట్రాఫిక్ ఆంక్షలతో పంజాగుట్ట, లక్టీకాపూల్, మెహిదీపట్నం రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఓల్డ్ సెక్రటేరియట్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్‌ను క్లోజ్ చేశారు. దీంతో తెలుగుతల్లి ఫ్లైఓవర్, లిబర్టీ, హిమాయత్ నగర్, లోయర్ ట్యాంక్‌బండ్, కవాడిగూడ రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.
ఎవరి కోసం ఈ రేసింగ్‌లు?
నేను లంగర్ హౌస్‌లో ఉంటున్నాను. బేగంపేట్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో జాబ్ చేస్తున్నాను. రోజూ మెహిదీపట్నం, ఖైరతాబాద్, రాజ్‌భవన్ రూట్‌లో ట్రావెల్ చేస్తుంటాను. మంగళవారం నుంచి ట్రాఫిక్ డైవర్షన్లు చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఆఫీస్ అవర్స్‌లో పరిస్థితి మరింత దారుణం. అరగంట ముందు బయలుదేరినా టైంకు ఆఫీస్ కు పోయే పరిస్థితి లేదు. జనం ఇంతగా ఇబ్బందులు పడుతుంటే.. ఈ రేసింగ్ లు ఎవరి కొసం?
- అభిలాష్, బ్యాంక్ ఎంప్లాయ్