హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభమైన ప్రతిష్ఠాత్మక ఫార్ములా- ఈ ప్రపంచ రేసింగ్ చాంపియన్‌షిప్ ముగిసింది. ఫార్ములా-ఈ రేస్ వరల్డ్ చాంపియన్ గా జీన్ ఎరిక్ వెర్గ్ నే నిలిచాడు. రెండవ స్థానంలో నిక్ క్యాసిడీ, మూడో స్థానంలో సెబాస్టియన్ బ్యూమి ఉన్నారు. అయితే, ఈ విజయంతో జీన్ ఎరిక్ మూడుసార్లు ఫార్ములా-ఈ చాంపియన్ అయ్యాడు. భారత్‌లో తొలిసారి జరుగుతున్న రేసింగ్‌లో ప్రపంచస్థాయి రేసర్లు పాల్గొని అదరగొట్టారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు ప్రారంభమైన రేసు గంటన్నర పాటు కొనసాగింది.
రేసింగ్ లో తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్3 కార్లతో రేసర్లు దుమ్ములేపారు. 2.8 కిలోమీటర్ల ట్రాక్ పై 11 జట్లు, 22మంది రేసర్లు 322 కిలోమీటర్ల వేగంతో కార్లను పరుగులు పెట్టించారు. 2013లో భారత్ లో ఫార్ములా-1 రేస్ జరిగింది. అయితే, మొదటిసారి జరుగుతున్న ఈ రేసింగ్ కు హైదరాబాద్ వేదికవ్వడం విశేషం. దీంతో ఫార్ములా ఈ రేసుకు అతిథ్యమిచ్చిన 27వ నగరంగా హైదరాబాద్ నిలిచింది. భారత్ నుంచి మహీంద్ర రేసింగ్, టీసీఎస్ జాగ్వార్ బరిలోకి దిగారు.
