
తెలంగాణలో గతేడాది మొత్తం 10 వేల282 పాములను ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ (ఫాస్) రక్షించగా, అందులో 95% హైదరాబాద్‌లో రక్షించినట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి అవినాష్ విశ్వనాథన్ తెలిపారు. ఎల్‌బి నగర్, వనస్థలిపురం, అత్తాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ నుండి హైదరాబాద్ శివార్లలో గరిష్ట సంఖ్యలో రెస్క్యూ కాల్‌లు అందాయి. హైదరాబాద్‌లో రక్షించబడిన చాలా పాములు విషపూరితమైన కలిగినవని అవినాష్ చెప్పారు.
ఈ నాగుపాములు కప్పలు, పక్షులు, బల్లులు మొదలైనవాటిని తింటాయని.. మనుషుల చుట్టూ నివసించడానికి బాగా అలవాటు పడ్డాయని చెప్పారు అవినాష్. హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్‌లోని డిఫెన్స్ కాలనీలో నివాసితులు పాములను గుర్తించి వెంటనే సమాచారం అందించడంతో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ ఫిబ్రవరి 4న ఆదివారం రోజున మూడు కొండచిలువలను సురక్షితంగా రక్షించింది. ఒక్కొక్కటి కనీసం 7 అడుగుల పొడవు ఉంది.
ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అనే సంస్థ 1995 నుండి పాములు, వన్యప్రాణులను సంరక్షిస్తూ వస్తుంది. తెలంగాణలో ప్రతి సంవత్సరం 10,000 పాములకు పునరావాసం కల్పిస్తుంది. ప్రతిరోజు 200–300 ఫోన్ కాల్స్ ను స్వీకరిస్తుంది. రక్షించబడిన అన్ని పాములను తెలంగాణ అటవీ శాఖ సహాయంతో అనువైన అటవీ ప్రాంతాలకు తరలిస్తారు.