
నెట్‌వర్క్, వెలుగు: ఊరూర పనుల జాతర–2025లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో పంచాయతీలు, అంగన్‌వాడీ సెంటర్లకు కొత్త బిల్డింగ్‌ల నిర్మాణాలకు ఎమ్మెల్యేలు, అధికారులు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
గంగాధర/మల్యాల/బోయినిపల్లి/చొప్పదండి, వెలుగు: చొప్పదండి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఊరురా పనుల జాతరలో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రామడుగు మండలం దేశరాజ్‌పల్లి, గంగాధర మండలం గర్శకుర్తిలో రూ.20 లక్షలతో నిర్మించనున్న జీపీ బిల్డింగ్‌లకు, బోయినిపల్లి మండలకేంద్రంలో మోడల్ స్కూల్‌కు సీసీ రోడ్డు, స్తంభంపల్లిలో అంగన్‌వాడీ బిల్డింగ్‌కు శంకుస్థాపన చేశారు. మల్యాల మండలం గొర్రెగుండంలో నిర్మించిన జీపీ, రాంపూర్‌లో హెల్త్ సబ్ సెంటర్, నూకపల్లిలో అంగన్వాడీ బిల్డింగ్‌లను ప్రారంభించారు. చొప్పదండి మండలం కాట్నపల్లిలో జీపీ బిల్డింగ్‌కు భూమిపూజ చేశారు.
ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు: ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఊరూర జాతరలో భాగంగా శుక్రవారం పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో రూ.55 లక్షలు, రాగినేడులో రూ.70 లక్షలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి పనులు ప్రారంభించారు. సుల్తానాబాద్ పట్టణంలోని జడ్పీ బాయ్స్ హైస్కూల్‌లో రూ .32 లక్షలతో ఆధునికరించిన క్లాస్ రూంను ప్రారంభించారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను ను ప్రారంభించారు.
రూ.9 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గోదావరిఖని, వెలుగు: గ్రామాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్అన్నారు. అంతర్గాం మండలంలోని అంతర్గాం టీటీఎస్, గోలివాడ, మూర్మూర్ గ్రామాలలో రూ.9కోట్లతో నిర్మించనున్న రోడ్లు, డ్రైనేజీ, అంగన్‌వాడీ, జీపీ బిల్డింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. మండల పరిధిలో అర్హులైన వారికి తెల్లరేషన్‌కార్డులు, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో టీజీడీడీసీఎఫ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఖాజీపూర్ జీపీ ప్రారంభం
కొత్తపల్లి, వెలుగు: కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లో రూ.20 లక్షలతో నిర్మించిన జీపీ బిల్డింగ్‌ను మాజీ మంత్రి, కరీంనగర్ఎమ్మెల్యే గంగుల కమలాకర్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం జీపీ సిబ్బంది, 100 రోజుల ప్రణాళికను పూర్తిచేసిన కార్మికులను శాలువాతో సత్కరించారు. ఈజీఎస్ నిధులతో పశువుల పాకలు నిర్మించుకున్న రైతులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.
మౌలిక వసతుల కల్పనకు చర్యలు
ముస్తాబాద్, వెలుగు: పనుల జాతరలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో పశువుల పాక నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని కేజీబీవీని తనిఖీ చేశారు.
జగిత్యాల రూరల్/రాయికల్/కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల, రాయికల్ మండలాల్లో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పనుల జాతర కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు గ్రామాల్లో జీపీ బిల్డింగ్‌లు, అంగన్‌వాడీ సెంటర్ల బిల్డింగ్‌లకు శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో శానిటేషన్ పనుల్లో చురుగ్గా పాల్గొన్న కార్మికులను సన్మానించారు. రూరల్ మండలం కండ్లపల్లి మోడ్‌లో స్కూల్‌లో కిచెన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు.