
న్యూఢిల్లీ: అల్‌ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు టెర్రరిస్టులను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్(ఏటీఎస్) అరెస్ట్ చేసింది. వీరిలో ఒకరిని ఢిల్లీలో, మరొకరిని నొయిడాలో, మరో ఇద్దరిని గుజరాత్‌లోని అహ్మదాబాద్, మోడాసాలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయివారిని మొహమ్మద్ ఫైక్ (ఢిల్లీ), మొహమ్మద్ ఫర్దీన్ (అహ్మదాబాద్), సెఫుల్లా ఖురేషి (మొడాసా), జీషాన్ అలీ (నోయిడా, యూపీ)గా అధికారులు గుర్తించారు.
ఈ నలుగురు నకిలీ నోట్ల దందా నడుపుతూ టెర్రర్ గ్రూప్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను, ఆటో-డిలీట్ యాప్‌లను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు. టెర్రరిస్టులు తమ కమ్యూనికేషన్ వివరాలను ఎప్పటికప్పుడు తొలగించడానికే ఆటో-డిలీట్ యాప్‌లను ఉపయోగించారని వివరించారు.
వీరికి చాలాకాలం నుంచి టెర్రర్ సంస్థతో సంబంధముందన్నారు. సోషల్ మీడియా ద్వారా అల్-ఖైదాతో సంప్రదింపులు జరిపారని చెప్పారు. గుజరాత్‌లో టెర్రర్ కార్యకలాపాలపై చర్చలు జరుపుతూ ఏటీఎస్ దృష్టిలో పడ్డారని వెల్లడించారు. ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌లు, నిఘా
ఆధారంగా నలుగురిని అరెస్ట్ చేసినట్లు వివరించారు.