నేపాల్ సంక్షోభానికి నాలుగు కోణాలు.. బలహీన ప్రజాస్వామ్యాలకు ఒక హెచ్చరిక

నేపాల్ సంక్షోభానికి నాలుగు కోణాలు.. బలహీన ప్రజాస్వామ్యాలకు ఒక హెచ్చరిక

సాధారణంగా తన పొరుగున ఉన్న పెద్ద దేశాల నీడలో బయటి ప్రపంచానికి అంతగా కనిపించని నేపాల్ ఇటీవలి తిరుగుబాటుతో ప్రపంచదృష్టిని ఆకర్షించింది. వీధుల్లో  వేలాదిమంది యువత, ఒక ప్రభుత్వం పతనం, భద్రతా బలగాలతో ఘర్షణలు... ఇవన్నీ నేపాల్ సున్నితమైన ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైన మలుపు. ఈ తిరుగుబాటుకు కేంద్ర బిందువు ఒక కొత్త తరం. అది ఖాళీ వాగ్దానాలతో విసిగిపోయింది, అవినీతితో అలసిపోయింది, అస్థిరమైన రాజకీయ వ్యవస్థతో నిరాశ చెందింది.  

ఖాట్మండు,  ఇతర ప్రాంతాలలో ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి, ఈ అలజడికి కారణమైన నాలుగు కోణాలను పరిశీలించాలి.  తక్షణ కారణం, వ్యవస్థాగత అవినీతి తీవ్రత,  నేపాల్ ప్రజాస్వామ్య ప్రయోగం అస్థిరత,  ప్రాంతీయ  జియోపాలిటిక్స్​తో  మిళితమైన డీప్ స్టేట్ శక్తుల మాయాజాలం.

ప్ర తి తిరుగుబాటు ఒక చిన్న నిప్పురవ్వతో  మొదలవుతుంది. నేపాల్ ప్రభుత్వపు నిర్లక్ష్యపూరిత ఉత్తర్వే ఈ మంటలకు కారణమైన ఆ నిప్పురవ్వ.  26 ప్రముఖ సోషల్ మీడియా యాప్​లపై ఆకస్మిక నిషేధం కేవలం ఒక విధాన నిర్ణయం కాదు.  అది యువత తమ ఆలోచనలను వ్యక్తపరిచే, కనెక్ట్ అయ్యే,  ఒకచోట చేర్చే సాధనంపై దాడి,  ప్రాపంచిక దృక్పథం ఉండి,  మంచి కనెక్టివిటీతో ఉన్న నేపాలీ జెన్​జడ్​కు ఇది కేవలం 
సెన్సార్షిప్  మాత్రమే కాదు, వారి గుర్తింపునే  నిరాకరించడంగా భావించారు.  రాత్రికి రాత్రే,  వారి సామాజిక జీవితాలకు, వృత్తిపరమైన ఆశలకు,  రాజకీయ చర్చలకు వేదికలు బ్లాక్ అయిపోయాయి. తక్షణం కోపం పెల్లుబికింది.  డిజిటల్ కోపంతో మొదలైన నిరసనలు వీధుల్లోకి  విస్తరించాయి,  కొన్నిరోజుల్లోనే అవి పూర్తిస్థాయి తిరుగుబాటుగా మారాయి.

అధికారిక  సర్వర్ల ద్వారా సోషల్ మీడియా నోరు మూయించి ఉండవచ్చు.  కానీ, ఆ నిషేధమే ఒక ఐక్యతా నినాదం అయింది. విచిత్రంగా, అసమ్మతిని అణచివేయడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం దానిని మరింత పెంచింది.  తాను పాలిస్తున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోలేని ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక తరాన్ని ఏకం చేసింది.  అయితే, ఈ నిషేధం అనే నిప్పురవ్వ తగలబెట్టేంత పెద్ద మంటగా మారడానికి కారణమైన ఇంధనం మాత్రం అవినీతి.  

ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేయడం,  బంధుప్రీతి,  వారసత్వం,   ప్రభుత్వాన్ని ఒక ప్రైవేట్ సంస్థలా నడుపుతున్నారనే ఆరోపణలు నేపాల్లోని రాజకీయ  నాయకులపై ఏళ్ళ తరబడి వినిపిస్తున్నాయి.  ఒకవైపు నిరుద్యోగం,  ద్రవ్యోల్బణం, తగ్గుతున్న అవకాశాలతో పోరాడుతున్న యువత,  వారి నాయకులు అడ్డూ అదుపులేని విలాసాల్లో మునిగిపోవడం సహించలేకపోయారు.  నేపాల్లో అవినీతి కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు. అది నైతిక దిగజారుడు, ప్రజా విశ్వాసం కోల్పోవడం, మొత్తంగా ప్రభుత్వపు చట్టబద్ధతనే ప్రశ్నార్థకం చేసే స్థాయిలో ఉంది.   కష్టపడి పనిచేసినా ఏమీ సాధించలేమని,  పరిచయాలు, లంచాలు తప్పవన్న విషయం ఒక తరం మొత్తం గమనించినప్పుడు ఆగ్రహం అనివార్యం అయింది. 

బలహీనంగా నేపాల్​ ప్రజాస్వామ్యం

రాచరికం రద్దు అయినప్పటి నుంచి నేపాల్ ప్రజాస్వామ్యం చాలా బలహీనంగా ఉంది.  నిరంతరం ప్రభుత్వ మార్పులు, అసమ్మతి ఉన్న సంకీర్ణాలు స్వార్ధపూరిత నాయకత్వం దానిని దెబ్బతీశాయి.  రాజకీయ పార్టీలు ప్రజా విశ్వాసానికి సంరక్షకులుగా ఉండకుండా అధికార దాహంతో ప్రవర్తించాయి.  తరచుగా ప్రధానులను మార్చడం, ఎడతెగని పార్లమెంటరీ వివాదాలు, ఏ విధానమూలేని స్థితి  సర్వసాధారణం అయ్యాయి.  నేపాల్ మారుతోన్న  క్రమంలో, ఈ గందరగోళాన్ని పెద్ద వాళ్లు భరించగలిగారు. కానీ,  జన్ జడ్​ యువత అలా వేచి ఉండదు.  వారు తక్షణ ప్రతిస్పందన,  వేగవంతమైన మార్పులు, నిరంతర ఆటంకాల ప్రపంచంలో బతుకుతున్నారు.  

వారి దృష్టిలో  ఫలితమివ్వని ప్రజాస్వామ్యం ఒక వెక్కిరింత. నిజమైన ఆర్థిక, సామాజిక సంస్కరణలను పట్టించుకోకుండా కుర్చీలాట ఆడే నాయకులు ఆజ్యం పోశారు.  ఏ  ప్రజాస్వామ్యం అయినా కనీసంగా కల్పించాల్సిన భరోసా అయిన స్థిరత్వాన్ని అందించడంలో నేపాల్ ప్రభుత్వం విఫలం అయింది.  అందువల్ల,  ఈ తిరుగుబాటు  ఒక  ప్రభుత్వానికి  వ్యతిరేకంగా మాత్రమే కాదు,  యువత ఆశలను అపహాస్యం చేసిన మొత్తం అస్థిర ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా జరిగింది.

వ్యూహాత్మక సరిహద్దుగా నేపాల్​

నాలుగో  కోణం మరింత సంక్లిష్టమైనది,  కలవరపరిచేది.  తిరుగుబాట్లలో  రహస్య శక్తులు లేకపోవడం చాలా అరుదు.  నేపాల్లో,  డీప్ స్టేట్ శక్తులు, మార్పుకు లొంగని బ్యూరోక్రాట్లు,  సైన్యంలోని కొన్ని శక్తులు, రాజకీయ- అధికార వ్యవస్థలో బలంగా పాతుకుపోయిన శక్తిమంతులూ ఇవన్నీ తెరవెనుక పనిచేస్తాయి.  ప్రజాస్వామ్యాన్ని  కాపాడడంలో  కాకుండా,  తమ ప్రభావాన్ని కాపాడుకోవడంలోనే వారికి ఆసక్తి. అల్లర్ల సమయాలు వారి బలం పెంచుకోవడానికి,  ప్రభుత్వాలను బలహీనపరచడానికి లేదా అధికారాన్ని తమకు అనుకూలంగా మళ్లించుకోవడానికి అవకాశాలను అందిస్తాయి. 

ఈ దేశీయ శక్తులతోపాటు, జియో పాలిటిక్స్ కూడా తమ  ప్రభావాన్ని  చూపుతుంది.  భారత్, -చైనా మధ్య ఉన్న నేపాల్ ఎల్లప్పుడూ  ఒక  వివాదాస్పద  ప్రాంతం.  భారతదేశం  నేపాల్​ను  బహిరంగంగా అస్థిరపరచకుండా ఉన్నప్పటికీ,  చైనా నేపాల్ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేయడంలో చాలా ఆసక్తి చూపింది.  బీజింగ్ నేపాల్​ను  ఒక వ్యూహాత్మక సరిహద్దుగా,  భవిష్యత్తులో ఉపయోగపడే భూభాగంగా చూస్తూ, రహస్యంగా అయినప్పటికీ, అంతర్గత రాజకీయాల్లో నిర్ణయాత్మకంగా ఉంటుంది. 

తప్పుడు సమాచార  ప్రచారాలు, కొన్ని వర్గాలకు  రహస్య నిధులు,  తమకు అనుకూలమైన వర్గాలకు మద్దతు ఇవ్వడం వంటివి చైనా వ్యూహంలో భాగం.  నేపాల్ అస్థిరత కొన్ని ప్రాంతీయ శక్తులకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించకుండా, తిరుగుబాటు వచ్చిన సమయం,  తీవ్రతను విశ్లేషించలేం. దేశీయ బలహీనత, బయటి అవకాశవాదాన్ని కలిసినప్పుడు, అస్థిరతను అదుపు చేయడం దాదాపు అసాధ్యం. ఈ నాలుగు కోణాలు కలిపి, నేపాల్ తిరుగుబాటు ఎందుకు ఒక పాలన మార్పుకు, హింసకు దారితీసిందో వివరిస్తాయి. 

బలహీన ప్రజాస్వామ్యాలకు ఒక హెచ్చరిక.

నేపాల్ ఒక ప్రమాదకరమైన చక్రంలో ప్రవేశించింది. దానిని ఆపగలిగేది ఉన్న ఒకే ఒక దారి యువతను గౌరవించే,  వారి ప్రయోజనాల కోసం వ్యవస్థను సంస్కరించే నాయకత్వం మాత్రమే.  ఈ తిరుగుబాటు కేవలం నేపాల్ కథ మాత్రమే కాదు. ఇది దక్షిణాసియా, ఇతర ప్రాంతాలలోని అన్ని బలహీన ప్రజాస్వామ్యాలకు ఒక హెచ్చరిక.  ఒక డిజిటల్ ప్రపంచంతో అనుసంధానించబడిన తరం అవినీతి నాయకత్వం, అస్థిరమైన వ్యవస్థలతో సహనం కోల్పోయినప్పుడు, మార్పు కేవలం ఎన్నికల ద్వారా మాత్రమే రాదు, అది నిరసనలు, హింస ద్వారా కూడా వస్తుంది. 

Gen Z పాతకాలం వారిలా విధిరాతను నమ్మడం లేదు. అది న్యాయం, వేగం, నిజాయితీని కోరుకుంటుంది. ఆ సత్యాన్ని విస్మరించిన నేపాల్, తగిన మూల్యం చెల్లించుకుంది. శ్రీలంక ఆర్థిక పతనం, బంగ్లాదేశ్ యువత నేతృత్వంలోని నిరసనలు ఇలాంటి అవినీతి ప్రభుత్వాలు, బలహీన పాలనపై కోపాన్ని ప్రతిబింబించాయి. ఇవన్నీ కలిసి ఒక విస్తృత ప్రాంతీయ హెచ్చరిక చేస్తున్నాయి: యువ పౌరులు వ్యవస్థాగత వైఫల్యాన్ని ఎల్లప్పుడూ సహిస్తూ ఉండరు. 

గౌరవం కోసం  పోరాటం

ఈ కారణాలలో ఏదో ఒకటి మాత్రమే తిరుగుబాటును ఈ స్థాయికి తీసుకెళ్లేది కాదు,  వాటన్నిటి కలయికే ఎవరూ ఆపలేని పరిస్థితి కారణం అయింది.  సోషల్ మీడియా నిషేధం కోపాన్ని వెళ్లగక్కేలా చేస్తే, అవినీతి దాని తీవ్రతను పెంచితే,  ప్రజాస్వామ్య అస్థిరత వ్యవస్థలను బలహీనం చేస్తే,  డీప్ స్టేట్ శక్తులు, జియో పాలిటిక్స్ అవకాశవాదులూ కలసి అల్లర్లు తగ్గేలా కాకుండా పెరిగేలా చేశారు. నేపాల్ జన్ జడ్​ యువతకు ఇది ఒక సైద్ధాంతిక అంశం కాదు,  గౌరవం కోసం జరిగిన పోరాటం.  

తిరుగుబాటు  ప్రణాళికతో జరిగింది కాదు,  విఫల ప్రజాస్వామ్యం కింద బతికే వారి అవమానాల నుంచి పుట్టినవారి ఆవేదన.  ఇప్పుడు మిగిలిన ప్రశ్న ఏమిటంటే,  నేపాల్ కొత్త పాలనా వ్యవస్థ  ఈ  తిరుగుబాటు నుంచి పాఠం నేర్చుకుంటుందా?  పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి అని, స్థిరత్వం మాత్రమే మళ్లీ అలజడి రాకుండా కాపాడగలదని అది గుర్తిస్తుందా?   లేకపోతే  మళ్ళీ అదే అవినీతి,  అంతర్గత  కలహాలతో మరో తిరుగుబాటుకు ఆస్కారం ఇస్తుందా?

- కె. కృష్ణసాగర్ రావు
 నేషన్​ బిల్డింగ్ ఫౌండేషన్ అధ్యక్షుడు