సిద్దిపేట, జగిత్యాల జిల్లాలో రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి

సిద్దిపేట, జగిత్యాల జిల్లాలో రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి
  • సిద్దిపేట జిల్లాలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను ఢీకొట్టిన కారు
  • ఇద్దరు మృతి, మరొకరికి గాయాలు
  • జగిత్యాలలో బైక్‌‌ను ఢీకొట్టిన కారు, చిన్నారితో పాటు ఆమె పెదనాన్న మృతి

దుబ్బాక/జగిత్యాల టౌన్‌‌, వెలుగు : సిద్దిపేట, జగిత్యాల జిల్లాల పరిధిలో సోమవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో 18 నెలల చిన్నారితో పాటు మరో ముగ్గురు చనిపోయారు. సిద్దిపేట జిల్లాలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను కారు ఢీకొట్టగా ఇద్దరు, జగిత్యాల జిల్లాలో కారు, బైక్‌‌ ఢీకొట్టడంతో చిన్నారితో పాటు ఆమె పెదనాన్న చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే... సిద్దిపేట జిల్లా అక్బర్‌‌పేటభూంపల్లి మండలం పోతారెడ్డిపేట గ్రామానికి చెందిన గోప దేవవ్వ (48), బ్యాగరి చంద్రవ్వ (45), బైండ్ల లాస్యలు కలిసి ఉపాధి పనుల కోసం సోమవారం ఉదయం సిద్దిపేట‌‌‌‌‌‌‌‌ – మెదక్‌‌ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నారు.

ఇదే టైంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన జ్ఞాన్‌‌సింగ్‌‌ ఫ్యామిలీతో కలిసి కారులో మెదక్‌‌ వెళ్తున్నాడు. పోతారెడ్డిపేట వద్దకు రాగానే కారు అదుపుతప్పి నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు మహిళలను ఢీకొట్టింది. దీంతో దేవవ్వ, చంద్రవ్వ అక్కడికక్కడే చనిపోగా, లాస్యకు స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు లాస్యను సిద్దిపేట ఏరియా హాస్పిటల్‌‌కు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకొని రాస్తారోకోకు దిగారు.

భూంపల్లి పోలీసులు వచ్చి నచ్చజెప్పినా గ్రామస్తులు ఆందోళన విరమించలేదు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌ చైర్మన్‌‌ బక్కి వెంకటయ్య, పీసీసీ సభ్యులు మద్దుల సోమేశ్వర్‌‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని కలెక్టర్‌‌తో ఫోన్‌‌లో మాట్లాడారు. తర్వాత సిద్దిపేట ఆర్డీవో సదానందం, డీఆర్డీఏ పీడీ జయదేవ్‌‌ ఆర్య వచ్చి.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

బైక్‌‌ కారు ఢీకొని...

జగిత్యాల టౌన్, వెలుగు : బైక్‌‌ను కారు ఢీకొట్టడంతో 18 నెలల చిన్నారితో సహా ఆమె పెదనాన్న చనిపోయాడు. జగిత్యాల పట్టణంలోని హనుమాన్‌‌వాడకు చెందిన పాదం మల్లేశ్‌‌ (35) తన తమ్ముడి కూతురు వితన్విని తీసుకొని బైక్‌‌పై పొలానికి వెళ్తున్నాడు. ఇదే టైంలో కండ్లపల్లి నుంచి వస్తున్న కారు బైక్‌‌ను ఢీకొట్టింది. దీంతో చిన్నారి వితన్వి ఘటనాస్థలంలోనే చనిపోగా, మల్లేశ్‌‌ తీవ్రంగా గాయపడ్డాడు.

గమనించిన స్థానికులు మల్లేశ్‌‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రఘుచందర్, టౌన్‌‌ సీఐ వేణుగోపాల్‌‌ ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.