
అమెరికాలో మనుషుల అక్రమ రవాణా గుట్టు రట్టు అయ్యింది. ఈ కేసులో నలుగురు తెలుగోళ్లు ఉండటం సంచలనంగా మారింది. ఉద్యోగం, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన మహిళలు, పురుషులను నిర్బంధించటం.. వాళ్లను తక్కువ జీతానికి పని చేయించటం.. బెదిరింపులకు పాల్పడటం.. షెల్ కంపెనీల్లో నిబంధనలకు విరుద్ధంగా వాళ్లతో పని చేయించటం వంటి కారణాలతో తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు తెలుగు వాళ్లను అరెస్ట్ చేశారు ప్రిన్స్ టన్ పోలీసులు. మహిళల అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన వారిలోచందన్ దాసిరెడ్డి, ద్వారక గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మాలే ఉన్నారు.
పోలీసుల కధనం ప్రకారం, నిందితులు ఒక అపార్ట్మెంట్ లో 15మంది అమ్మాయిలతో వారికి చెందిన షెల్ కంపెనీల్లో బలవంతంగా వర్క్ చేయించుకుంటున్నారని తేలింది. సదరు అపార్ట్మెంట్ లో ఎక్కువ మంది ఉండటం గమనించిన పెస్ట్ కంట్రోల్ వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటంతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది. మార్చ్ 13, 2024న అతని నుండి ఫిర్యాదు అందుకున్న ప్రిన్స్ టన్ పోలీసులు ఆ అపార్ట్మెంట్ తనిఖీ చేసి అక్రమ రవాణా రాకెట్ ను ఛేదించారు.
ఈ ముఠా ఒక్క ప్రిన్స్ టన్ లో మాత్రమే కాకుండా మెలిస్సా, మిక్ కెన్నీ వంటి ఇతర నగరాల్లో కూడా అమ్మాయిల అక్రమ రవాణాకు పాల్పడినట్లు గుర్తించారు పోలీసులు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి లాప్ టాప్స్, సెల్ ఫోన్స్, ప్రింటర్స్, ఫేక్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు.ఈ ముఠాలోని నిందితులంతా తెలుగువారే కావటం గమనార్హం.