అల్లరిమూకలపై జవాన్ల కాల్పులు.. నలుగురు మృతి

V6 Velugu Posted on Apr 11, 2021

  • బెంగాల్​ ఎన్నికల్లో హింస
  • పోలింగ్ బూత్​పై అల్లరి మూకల దాడి.. గన్స్ లాక్కునే యత్నం..
  • జవాన్ల కాల్పుల్లో నలుగురు మృతి..ఘర్షణల్లో మరొకరు 
  • కూచ్ బెహర్ జిల్లా సిటాల్​ కుచ్​లో ఘటన
  • హింసకు తృణమూల్ గూండాలే కారణం: ప్రధాని మోడీ
  • ఇది అమిత్​షా కుట్ర: మమత 
  • పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు: మమత 
  • 4వ విడతలో 76.16% పోలింగ్ 

కోల్‌‌‌‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస చోటు చేసుకుంది. కూచ్ బీహార్ జిల్లా సిటాల్ కుచి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ వద్ద శనివారం ఉదయం 9.40 గంటలకు సీఐఎస్ఎఫ్ బలగాలు, పోలింగ్ సిబ్బందిపై 150 మందితో కూడిన అల్లరిమూకలు దాడికి పాల్పడ్డాయి. క్విక్ రియాక్షన్ టీం వెహికల్ ను ధ్వంసం చేయడంతో పాటు సీఐఎస్ఎఫ్ జవాన్ల వద్ద నుంచి గన్స్ కూడా లాక్కునేందుకు ప్రయత్నించడంతో జవాన్లు తొలుత గాలిలోకి, ఆ తర్వాత ఆందోళనకారులపైకి కాల్పులు జరిపారు. దీంతో నలుగురు వ్యక్తులు మృతి చెందారని, మరో ముగ్గురు, నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. మృతులు నలుగురూ తమ పార్టీ మద్దతుదారులే అని తృణమూల్ కాంగ్రెస్ వెల్లడించింది. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలంటూ జిల్లా అధికారులను ఆదేశించినట్లు ఎలక్షన్ ఆఫీసర్లు చెప్పారు. అంతకుముందు సిటాల్ కుచి నియోజకవర్గంలోనే మరో పోలింగ్ బూత్ సమీపంలో జరిగిన ఘర్షణలో ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. 

అసలేం జరిగిందంటే.. 
కూచ్ బీహార్ జిల్లా, సిటాల్ కుచి నియోజకవర్గంలోని జోర్ పట్కీలోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను అడ్డుకుంటున్న 50, 60 మంది గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు, సీఐఎస్ఎఫ్ క్విక్ రియాక్షన్ టీం (క్యూఆర్టీ) సభ్యులు వెళ్లారు. గుంపును చెదరగొడుతుండగా ఓ పిల్లాడు కిందపడిపోయాడు. దీంతో ఆగ్రహం చెందిన గుంపులోని వాళ్లు సీఐఎస్ఎఫ్​వెహికల్ ను ధ్వంసం చేశారు. క్యూఆర్టీ జవాన్లు గాలిలోకి ఐదారు రౌండ్లు కాల్పులు జరిపారు. అప్పటికి పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చినా.. గంట తర్వాత అక్కడికి సమీపంలోని మరో బూత్ వద్దకు 150 మంది వచ్చి దాడి ప్రారంభించారు. రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపినా అల్లరిమూక వెనక్కి తగ్గకుండా, హోం గార్డులు, పోలింగ్ సిబ్బందిని కొట్టడం మొదలుపెట్టారు. దాడి జరిగిన సమయంలో నలుగురు సీఐఎస్ఎఫ్​జవాన్లు మాత్రమే అక్కడ ఉన్నారని, అల్లరిమూకలు గన్స్ లాక్కునేందుకు ప్రయత్నించినందుకే కాల్పులు జరపాల్సి వచ్చిందని సీఐఎస్ఎఫ్​అధికారులు వెల్లడించారు. ఈ సంఘటనపై నివేదికతో పాటు సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ను కూడా ఎన్నికల సంఘానికి సమర్పిస్తామని తెలిపారు.  

పోలింగ్ వాయిదా 
జోర్ పట్కీలోని 126/5 పోలింగ్ బూత్ వద్ద హింస జరిగిన వెంటనే అధికారులు ఎన్నికల సంఘానికి మధ్యంతర నివేదిక అందజేశారు. దీంతో అక్కడ పోలింగ్ ను ఎన్నికల సంఘం నిలిపివేసింది. మిగతా 4 విడతల పోలింగ్ కోసం అదనంగా 71 కంపనీల కేంద్ర బలగాలను పంపాలని కేంద్ర హోం మినిస్ట్రీని ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఓటర్లపైకి కాల్పులా?: ఏచూరి 
కేంద్ర బలగాలు ఓటర్లపైకి కాల్పులు జరపడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని పార్టీ జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.

దీదీ, ఆమె గూండాల పనే: మోడీ 
బెంగాల్ ఎన్నికల్లో హింసకు దీదీ, ఆమె గూండాలే కారణమని ప్రధాని మోడీ అన్నారు. ‘‘కూచ్ బీహార్ లో జరిగిన ఘటన తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. బీజేపీకి మద్దతు పెరుగుతున్నందుకే దీదీ, ఆమె గూండాలు తట్టుకోలేక దాడులకు పాల్పడుతున్నారు” అని ఆయన ఆరోపించారు. శనివారం సిలిగురి, కృష్ణానగర్ లలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మోడీ మాట్లాడారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. రిగ్గింగ్ కోసమే ప్రజలను రెచ్చగొడుతున్నారని మమతపై మండిపడ్డారు. 

ఇది అమిత్ షా కుట్ర: మమత 
సిటాల్ కుచిలోని పోలింగ్ బూత్ వద్ద నలుగురిని కేంద్ర బలగాలు కాల్చిచంపడంపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఘటన పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని, దీని వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుట్ర ఉందన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సీఐడీ దర్యాప్తుకు ఆదేశిస్తానని ఆమె వెల్లడించారు. శనివారం ఉత్తర 24 పరగణాల జిల్లా బదూరియాలో జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 4 వరకూ రాష్ట్రమంతటా నిరసన ర్యాలీలు నిర్వహించాలంటూ తృణమూల్ క్యాడర్ కు పిలుపునిచ్చారు. 

4వ విడతలో 76.16% పోలింగ్ 
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 8 విడతల్లో జరగనుండగా, శనివారం 4వ విడత పోలింగ్ పూర్తయింది. ఈ విడతలో హౌరా, దక్షిణ 24 పరగణాలు, అలీపుర్దౌర్, కూచ్ బీహార్‌, హుగ్లీ జిల్లాల్లోని 44 సీట్లకు పోలింగ్ జరిగింది. 4వ విడతలో మొత్తం 76.16% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఈ ఫేజ్‌లో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో, మాజీ క్రికెటర్, బీజేపీ నేత మనోజ్ తివారీ, రాష్ట్ర మంత్రులు పార్థ చటర్జీ, అరూప్ బిశ్వాస్, తదితరులు బరిలో ఉన్నారు. 
 

Tagged modi, bengal elections, amit shah, mamata

Latest Videos

Subscribe Now

More News