
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ఢీకొట్టడంతో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం (మే 25) ఉదయం మధురై జిల్లాలోని కుంజంపట్టి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా.. అతి వేగంగా దూసుకొచ్చిన కారు వీరిని ఢీకొట్టింది.
దీంతో అక్కడికక్కడే నలుగురు మరణించగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మధురై పోలీసు సూపరింటెండెంట్ అరవింద్ తెలిపారు.
ఈ ప్రమాదం ఉసిలంపట్టి సమీపంలో జరిగిందని ఆయన వెల్లడించారు. ఒకేసారి కుటుంబంలో నలుగురు మరణించడం.. ముగ్గురు గాయపడటంతో మృతుల ఫ్యామిలీలో తీవ్ర విషాదం అలుముకుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.