4 ఓసీపీల ప్రారంభం ఎప్పుడు?

4 ఓసీపీల ప్రారంభం ఎప్పుడు?
  •     అటవీ అనుమతుల ఆలస్యంతో సింగరేణి ఆందోళన
  •     కాగితాలకే పరిమితమైన బొగ్గు టార్గెట్లు
  •     నైనీ బొగ్గు బ్లాక్  కోసం ఒడిశాకు సింగరేణి బృందం
  •     రాష్ట్ర సర్కారు​సహకారంపై గంపెడు ఆశలు

కోల్​బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థ కొత్తగా ఏర్పాటు చేయనున్న నాలుగు ఓపెన్​కాస్ట్​  బొగ్గు గనులపై గంపెడు ఆశలు పెట్టుకుంది. ఒడిశాలో సింగరేణికి కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్​తో పాటు మూసివేసిన అండర్​గ్రౌండ్​ మైన్లను ఓసీపీలుగా మార్చి మిగిలిన బొగ్గును వెలికితీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. గనులకు సంబంధించిన  ఫారెస్ట్​ డిపార్ట్ మెంట్​ పర్మిషన్ల కోసం ఏళ్లుగా ఎదురుచూడాల్సి వస్తోంది. 2023–-24 ఆర్థిక సంవత్సరం నైనీ బ్లాక్​తో పాటు సింగరేణిలో కొత్తగా గోలేటీ, వీకే, రోంపెడు (జేకే) ఓసీపీ గనులను ప్రారంభించి  బొగ్గు ఉత్పత్తి చేసేందుకు సింగరేణి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. బొగ్గు ఉత్పత్తి టార్గెట్లను సైతం గనులకు కేటాయించింది. అయితే ఇప్పటి వరకు మైన్లకు సంబంధించిన ఫారెస్ట్​ పర్మిషన్లు రాకపోవడంతో యాజమాన్యం ఆందోళనకు గురవుతోంది. 

సింగరేణిలో మూడు  ఓసీపీలకు

బెల్లంపల్లి ఏరియాలోని మంచిర్యాల, కుమ్రంభీం జిల్లాల సరిహద్దులో  కొత్తగా గోలేటీ ఓసీపీ పేరుతో మైన్​ ఏర్పాటు చేయాలని మూడేండ్ల కింద సింగరేణి నిర్ణయించింది. గనిలో ఏడాదికి 35 లక్షల బొగ్గు ఉత్పత్తి చేసే చాన్స్​ఉంది. కొత్తగూడెం ఏరియాలో వీకే-7 యూజీ, జీకే ఓసీ, పీవీకే-5 గనులను కలుపుతూ కొత్తగా వెంకటేశ్​ఖని (వీకే) ఓసీపీని 2021-–22 ఉత్పత్తి సంవత్సరంలో ప్రారంభించాలని యాజమాన్యం భావించింది. ఈ మైన్​ నుంచి ఏటా 53 లక్షల బొగ్గు ఉత్పత్తి చేసే వీలుంది. ఇల్లందు ఏరియాలో ఏటా 20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్​గా కొత్తగా రోపెండు (జేకే) ఓసీపీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

వీటి కోసం ఇప్పటికే యాజమాన్యం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కూడా పూర్తి చేసింది. గనులకు కావాల్సిన భూమిని పొందేందుకు ప్రత్యామ్నాయంగా అటవీ శాఖకు ఇతర  ప్రాంతాల్లో భూములు కూడా కేటాయించింది. బొగ్గు ఉత్పత్తికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న యాజమాన్యం 2023-–24 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు  ఉత్పత్తి టార్గెట్లు సైతం ప్రకటించింది. ఓసీపీలకు అవసరమైన కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలకు పర్మిషన్ల కోసం ఏడాదిన్నర కింద దరఖాస్తు చేసుకుంది. 

పదేళ్లుగా నైనీ బ్లాక్​ కోసం ఎదురుచూపులు

కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కిందట ఒడిశాలోని అంగోల్​ జిల్లాలోని నైనీ బొగ్గు బ్లాక్​ను సింగరేణికి కేటాయించింది. కోల్​ బ్లాక్​లో 340 మిలియన్​ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉండగా.. ఏటా 100 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని గని జీవిత కాలాన్ని 38 ఏళ్లుగా నిర్ధారించారు. ప్రాజెక్టు కోసం సింగరేణి యాజమాన్యం 1800 ఎరాల భూమిని సేకరించి 80 శాతం భూమికి డబ్బులు కూడా కట్టింది. అన్ని రకాల పర్మిషన్లు రాగా కొంతమేర ఓవర్​బర్డెన్​ (మట్టి) కూడా తీసింది. అయితే ఒడిశా సర్కారు​నుంచి ఫారెస్ట్​ క్లియరెన్స్​ రావాల్సి ఉంది.

గనులకు బొగ్గు ఉత్పత్తి టార్గెట్లు

కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చే నాలుగు ఓసీపీల్లో యాజమాన్యం 2023–-24 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి టార్గెట్లను నిర్ణయించింది. వీకే ఓసీపీలో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 30 లక్షల టన్నుల ఉత్పత్తి, రోపేండు ఓసీపీలో 10 లక్షల టన్నులు, బెల్లంపల్లి ఏరియా గోలేటీలో ఏడాది చివరిలోపు కనీసం 4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని ప్లాన్​ చేశారు. మరోవైపు ఒడిశా నైనీ బ్లాక్​లో ఏడాదికి కోటి లక్షల టార్గెట్​ పెట్టుకున్న యాజమాన్యం.. తొలి ఏడాది 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.

గనులకు సంబంధించిన  పర్మిషన్ల కోసం సింగరేణి యాజమాన్యం.. కాంగ్రెస్​ సర్కారు సహకారంపై ఆశలు పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతో సింగరేణి సీఎండీ బలరాం నాయక్  చర్చించారు. నైనీ బ్లాక్  చివరి దశ అనుమతులకు ఒడిశా సర్కారు​సహకారం కావాల్సి ఉందని, ఒడిశా సీఎంతో చర్చించేందుకు సింగరేణి నుంచి అధికారుల బృందాన్ని భువనేశ్వర్​కు పంపాలని నిర్ణయించారు. కాలయాపన లేకుండా అన్ని పర్మిషన్లు వస్తే వెంటనే ఉత్పత్తి ప్రారంభించవచ్చని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.