సాగర్ కెనాల్​లో ముగ్గురు గల్లంతు

సాగర్ కెనాల్​లో ముగ్గురు గల్లంతు
  • ఒకరి డెడ్ బాడీ లభ్యం 

ఖమ్మం రూరల్​, వెలుగు : రిమాండ్ ఖైదీని చూసేందుకు వెళ్లిన నలుగురు వ్యక్తులు సాగర్ కెనాల్​లో గల్లంతవగా.. ఒకరు మృతి చెందిన  ఘటన ఖమ్మం సిటీలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి జిల్లా మణుగూరు టౌన్ కు చెందిన రాము అనే వ్యక్తి ఓ కేసులో ఖమ్మం జిల్లా జైలులో రిమాండ్​ ఖైదీగా ఉన్నాడు. రాముకు తెలిసిన మణుగూరు చెందిన రొండ వెంకటేశ్వర్లు(33), చల్లా రమేశ్(38), ప్రసాద్​(27), బండారు భరత్(30) సోమవారం మధ్యాహ్నం ఆటోలో ములాఖత్ అయ్యేందుకు జిల్లా జైలు వెళ్లారు.  రామును చూసిన అనంతరం ప్రకాశ్​నగర్​లోని వెంకటేశ్వర్లు మామ పిట్టల శ్రీనివాస్​ ఇంటికి వెళ్లి అందరూ మద్యం తాగారు. అనంతరం అర్ధరాత్రి రమేశ్​అన్న కొడుకు శ్రీహరి ఇంటికి దానవాయిగూడెం వెళ్లి అక్కడ కూడా మద్యం తాగారు.

 ఇక ఇంటికి వెళ్తున్నామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి దానవాయిగూడెం ఎన్​ఎస్​పీ కెనాల్​వద్దకు వెళ్లి ఆటోను ఆపారు. వెంకటేశ్వర్లు ఆటోలో నిద్రిపోగా..  రమేశ్, ప్రసాద్, భరత్ ​స్నానం చేసేందుకు కాల్వలోకి దిగారు. మద్యంమత్తులో ముగ్గురు కొట్టుకు పోయారు. మంగళవారం ఉదయం నిద్రలేచిన వెంకటేశ్వర్లుకు ముగ్గురూ కనిపించలేదు. దీంతో కెనాల్ వద్ద వెతకగా ముగ్గురి దుస్తులు కనిపించాయి. వెంటనే బంధువులకు, పోలీసులకు సమాచారం అందించాడు. ఖమ్మం టౌన్​ సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లతో కాల్వలో గాలింపు చేపట్టగా భరత్​ మృతదేహం దొరికింది.  వెంకటేశ్వర్లు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మిడ్ మానేరు వరద కాల్వలో వ్యక్తి ..

 బోయినిపల్లి : -మిడ్ మానేరు వరద కాల్వలో మునిగి వ్యక్తి గల్లంతైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం..  బోయినిపల్లి మండలం కొదురుపాకకు చెందిన నాగుల కిషన్ (35) ఏడాది కింద వరదవెల్లి శివారులోని -మిడ్ మానేరు వరద కాల్వ పక్కన భూమిని కొని వ్యవసాయం చేస్తున్నాడు. మంగళవారం పొలానికి నీరు పెట్టేందుకు ఫ్రెండ్స్ కనకయ్య, శేఖర్ తో కలిసి వెళ్లాడు. పొలం వద్ద పైపు పగిలిపోవడంతో మరమ్మతు చేసేందుకు వరదకాల్వ నీటిలోకి దిగాడు. మోటారు ఆన్​లో ఉండడంతో ఒక్కసారిగా అతనికి కరెంట్​షాక్​కొట్టింది.

దీంతో కిషన్​ నీటిలో మునిగి  గల్లంతు అయ్యాడు. అతని ఫ్రెండ్స్ కుటుంబసభ్యులకు, గ్రామస్తులకు సమాచారం అందించారు. వేములవాడ రూరల్​ సీఐ శ్రీనివాస్​, ఎస్ఐ పృథ్వీధర్​గౌడ్ ​వెళ్లి కిషన్ కోసం గాలింపు చేపట్టారు. కరీంనగర్​ నుంచి గజ ఈతగాళ్లను రప్పించి గాలించినా ఫలితం లేదు. అప్పటికే చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. కిషన్​కు భార్య రేఖ, 40 రోజుల కూతురు ఉన్నారు. పెండ్లైన12 ఏండ్లకు కూతురు పుట్టడంతో మురిసిపోయిన ఆ కుటుంబంలో  తీవ్ర విషాదం నెలకొంది.