మహబూబాబాద్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్

మహబూబాబాద్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కరోనా పాజిటివ్

మహబూబాబాద్ జిల్లా: నాలుగు రోజుల క్రితం మహబూబాబాద్ లోని బాలికల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. విద్యార్థులకు కరోనా చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులకు కరోనా అని తేలడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహబూబాబాద్ లోని ప్రభుత్వ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు ఇంటి బాట పట్టారు. అక్కడే ఉంటే తమ పిల్లలకు కూడా కరోనా సోకుతుందనే భయంతో విద్యార్థుల తల్లిదండ్రులు... హాస్టళ్లకు వెళ్లి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్నారు.

ఇకపోతే... జిల్లాలోని  ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 29న  ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో వారిని వెంటనే మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వానపాము పడ్డ పప్పు, కిచిడీ తినడం వల్లే ఫుడ్ పాయిజనింగ్ అయిందని అధికారులు తెలిపారు. ఫుడ్ పాయిజన్ బారినపడి చికిత్స తీసుకుంటున్న విద్యార్థులకు కరోనా సోకిందని తాజాగా అధికారులు ప్రకటించారు.