హర్యానాలో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్

హర్యానాలో నలుగురు ఉగ్రవాదుల అరెస్ట్

చండీఘడ్ : హర్యానా పోలీసులు నలుగురు ఖలిస్థానీ టెర్రరిస్టులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ఉగ్రవాదులు తెలంగాణలోని ఆదిలాబాద్, మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు పేలుడు పదార్థాలు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.  నలుగురు టెర్రరిస్టులు హర్యానా నుంచి ఢిల్లీకి ఇన్నోవా కారులో వెళ్తుండగా.. బస్తారా టోల్ ప్లాజా వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పంజాబ్ కు చెందిన గుర్ప్రీత్, భూపీందర్, అమన్ దీప్, పర్మీందర్గా గుర్తించారు.  

పోలీసులు అరెస్ట్ చేసిన నలుగురిలో ప్రధాన నిందితుడైన గుర్ప్రీత్ గతంలో జైలులో ఉన్న సమయంలో పాకిస్థాన్తో సంబంధమున్న రాజ్బీర్తో పరిచయమైనట్లు పోలీసులు చెప్పారు. గుర్ ప్రీత్తో పాటు మిగిలిన ముగ్గురు నిందితులకు పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐతో సంబంధముందని, వారంతా దేశవ్యాప్తంగా పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీరందరూ మరో టెర్రరిస్ట్ హర్వీందర్ సింగ్ ఆదేశాల మేరకు వివిధ ప్రాంతాలకు ఆయుధాలు, పేలుడు పదార్థాలు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి దేశవాళీ తుపాకీతో పాటు 31 బుల్లెట్లు, ఐఈడీ కలిగిన మూడు ఐరెన్ కంటైనర్లు రూ.1.30లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.